ఆ వేతనాలకు ఆయుర్వేద వైద్యులు అర్హులు కారు.. - సుప్రీంకోర్టు
సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు, తీవ్ర గాయాలతో పాటు అత్యవసర కేసుల్లో వైద్యసేవలు అందించే ఎంబీబీఎస్ డాక్టర్లతో ఆయుర్వేద వైద్యులు సమానం కారని ధర్మాసనం పేర్కొంది.
ఎంబీబీఎస్ (అల్లోపతి) డాక్టర్లతో సమాన వేతనాలకు ఆయుర్వేద వైద్యులు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వైద్యులతో సమానంగా ఆయుర్వేద ప్రాక్టీషనర్లను కూడా పరిగణించాలంటూ 2012లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.
అత్యవసర కేసుల్లో వైద్యసేవలు అందించేది వారే..
సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు, తీవ్ర గాయాలతో పాటు అత్యవసర కేసుల్లో వైద్యసేవలు అందించే ఎంబీబీఎస్ డాక్టర్లతో ఆయుర్వేద వైద్యులు సమానం కారని ధర్మాసనం పేర్కొంది. శవపరీక్షలను సైతం ఎంబీబీఎస్ డాక్టర్లే చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
మా ఉద్దేశం అది కాదు..
అల్లోపతి వైద్య విధానం గొప్పదా, ఆయుర్వేద వైద్య విధానం గొప్పదా అనేది చెప్పటం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధునిక వైద్య శాస్త్ర పరిజ్ఞానం, అత్యవసర సేవలు, సంక్లిష్టమైన శస్త్ర చికిత్సల వంటివాటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అల్లోపతి డాక్టర్లకే ఆ విధులను కేటాయిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. మన దేశంలో ఆయుర్వేదానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ ఆ వైద్యుల పనితీరు భిన్నమైనదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్నామ్నాయ లేదా దేశీయ వైద్య విధానంగా ఆయుర్వేదం ప్రాముఖ్యతను గుర్తిస్తామని తెలిపింది.