ఈద్గా మైదానంలో వినాయక వేడుకలకు సుప్రీంకోర్టు నిరాకరణ.. బెంగళూరులో టెన్షన్

ఈ తీర్పు రావడంతో ఈద్గా మైదానం వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా పెంచారు. బెంగళూరులో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement
Update:2022-08-31 09:17 IST

వినాయక చవితి పండుగ వేళ.. కర్నాటక రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై వక్ఫ్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఈద్గా మైదానం తమదే అంటూ వక్ఫ్ బోర్డు, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ వాదిస్తున్నాయి. ఆ ల్యాండ్ ప్రభుత్వానిదే అని చెబుతూ.. గణేష్ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. దీనిపై హైకోర్టులో వక్ఫ్ బోర్డు పిటిషన్ దాఖలు చేయగా.. స్టేటస్ కో విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. కాగా, మంగళవారం రాత్రి అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత ధర్మాసనం వినాయక ఉత్సవాల నిర్వహణకు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న స్టేటస్ కోనే కొనసాగించాలని సూచించింది.

జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. గత 200 ఏళ్లుగా ఆ వివాదాస్పద స్థలంలో ఇలాంటి ఉత్సవాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాగా, ఈద్గా మైదానంలో నవరాత్రి ఉత్సవాలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని, అక్కడ ఎలాంటి శాశ్వత కట్టడాలు నిర్మించబోమని కర్నాటక ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. నవరాత్రులు ముగిసిన రెండో రోజే అక్కడ నుంచి మొత్తం ఖాళీ చేస్తామని కూడా చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ఇలాంటి ఉత్సవాల పట్ల ప్రజలు విశాలమైన మనస్తత్వం కలిగి ఉండాలని కోరారు. సిటీలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య లేదని.. అందుకే పూజకు అనుమతించాలని వారు సుప్రీంకోర్టును కోరారు.

అయితే వక్ఫ్ బోర్డు తరపున వాదించిన కపిల్ సిబాల్, దుష్యంత్ దవే కర్నాటక ప్రభుత్వ తరపు లాయర్ల వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఇచ్చే హమీపై ధర్మాసనం ఆధారపడవద్దని కోరారు. బాబ్రి మసీదును కాపాడతానని గతంలో యూపీ సీఎం సుప్రీంకోర్టుకు కూడా ఇలాగే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వీరి వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం ఈద్గా మైదానంలో ఎలాంటి ఉత్సవాలు జరపడానికి వీల్లేదని, గతంలో ఉన్న స్టేటస్ కోనే కొనసాగించాలని తీర్పు చెప్పింది.

అంతకు ముందు మంగళవారం సాయంత్రం ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును వాదించింది.. అయితే ఇద్దరు జడ్జిలు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. కపిల్ సిబాల్, దుష్యంత్ దవే వెంటనే సీజేఐను కలిశారు. ఈ కేసును ఇవ్వాలే పరిష్కరించాలని.. బుధవారం ఉత్సవాల ప్రారంభరోజు కావడంతో ఈ రాత్రికే ముగించాలని కోరారు. దీంతో ఆయన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ తీర్పు రావడంతో ఈద్గా మైదానం వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా పెంచారు. మతఘర్షణలు చెలరేగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో నగరంలో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News