'సుప్రీం కోర్ట్ ముస్లింల పక్షపాతి': ఢిల్లీలో స్కూల్ పిల్లలతో హిందుత్వ సంఘాల ధర్నా!

ఫిబ్రవరి 5న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సుదర్శన్ టీవీ అధినేత, హిందుత్వ కార్యకర్త సురేశ్ చవాన్కే కు మద్దతుగా ఓ ప్రదర్శన జరిగింది. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ ప్రదర్శనలో మెజార్టీ స్కూల్ పిల్లలే ఉన్నారు.

Advertisement
Update:2023-02-06 13:54 IST

''ఈదేశాన్ని హిందూ దేశంగా మార్చడాన్ని వ్యతిరేకించేవాళ్ళను హిందువులందరూ చంపండి లేదా చావండి '' అని ఓ కార్యక్రమంలో పిలుపునిచ్చిన సుదర్శన్ ఛానల్ అధినేత సురేశ్ చవాన్కే పై కేసు ఎందుకు నమోదు చేయలేదని కొద్ది రోజుల కింద సుప్రీం కోర్టు పోలీసులను ప్రశ్నించింది.

దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. సుప్రీం కోర్టు ముస్లింలకు పక్షపాతిగా వ్యవహరిస్తోందని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఫిబ్రవరి 5న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సుదర్శన్ టీవీ అధినేత, హిందుత్వ కార్యకర్త సురేశ్ చవాన్కే కు మద్దతుగా ఓ ప్రదర్శన జరిగింది. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ ప్రదర్శనలో మెజార్టీ స్కూల్ పిల్లలే ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హిందుత్వ వాదులు సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సురేశ్ చవాన్కే పై సుప్రీం కోర్టు చట్టపరమైన వేధింపులకుపాల్పడుతోందన్నారు.

2002లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన హిందుత్వ గ్రూపు హిందూ యువ వాహిని నిర్వహించిన కార్యక్రమంలో చవాన్కే చేసిన ద్వేషపూరిత ప్రసంగాన్ని గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు విమర్శించింది. "ఈ కార్యక్రమంలో ఎటువంటి ద్వేషపూరిత ప్రసంగం చేయలేదు" అని తేల్చిన ఢిల్లీ పోలీసులపై కూడా కోర్టు మండిపడింది..

ఈ కార్యక్రమంలో ప్రేక్షకులతో ప్రమాణం చేయిస్తూ చవాన్కే ఇలా అన్నారు:

“అవసరమైతే, మేము దాని (హిందూ దేశం) కోసం చంపుతాము లేదా చస్తాము. కానీ మేము దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి తీరుతాము. మన పూర్వీకులు, దేవతలు మన లక్ష్యాన్ని సాధించే శక్తిని మన‌కు ప్రసాదిస్తారు. ” అనిఅన్నారు.

పైన పేర్కొన్న ప్రమాణంలో తప్పు ఏమీ లేదని జంతర్ మంతర్ వద్ద నిన్న ప్రదర్శన చేసిన హిందుత్వ నాయకులు పేర్కొన్నారు. చాలా మంది వక్తలు సుప్రీంకోర్టు "ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి" ,"హిందువులపై కఠినంగా వ్యవహరిస్తున్నారని" అని ఆరోపించారు.

వక్తలలో ఒకరైన, రాష్ట్ర నిర్మాణ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, “పోలీసులు ఇప్పటికే చవాన్కే ఏ నేరం చేయలేదని పేర్కొన్నప్పటికీ, మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను సుప్రీంకోర్టు ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇస్లాం మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. .

ఈ కార్యక్రమంలో రాగిణి తివారీ, క‌ర్ణి సేనకు చెందిన సూరజ్ పాల్ అమ్ము, ఆస్తా మా, అన్నపూర్ణ భారతి వంటి హిందుత్వ నాయకులు పాల్గొన్నారు. చవాన్కే మాత్రం హాజరుకాలేదు.

ప్రేక్షకులలో సుమారు 300-400 మంది ఉన్నారు, వారిలో మూడవ వంతు మంది పాఠశాల విద్యార్థులు.

“మా టీచర్ (గురువు) మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మేమొందుకొచ్చామో కారణం నాకు తెలియదు, ”అని హర్యానాలోని పాల్వాల్ నుండి వచ్చిన 8వ తరగతి విద్యార్థి చెప్పాడు.

సుప్రీంకోర్టు మందలింపు తర్వాత, ఢిల్లీ పోలీసులు సురేశ్ చవాన్కేపై మే 4, 2022న ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.అయితే అతన్ని అరెస్టు చేయలేదు.

జనవరి 10, 2023న సుప్రీంకోర్టు మరోసారి ఢిల్లీ పోలీసులను ఈ విషయంపై నిలదీసింది, గత ఏడాది ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఎనిమిది నెలల తర్వాత కూడా అరెస్ట్ కానీ, చార్జిషీట్ కానీ ఎందుకు లేదని ప్రశ్నించింది.

జంతర్ మంతర్ కార్యక్రమానికి ముందు, చావాంకే ట్విట్టర్‌లో “హిందూ దేశం గురించి ప్రమాణం చేయడం నేరం ఎలా అవుతుంది?” అనే పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈవెంట్ తర్వాత, అతను హాజరైన పిల్లలతో సహా దానికి సంబంధించిన విజువల్స్‌ను ట్వీట్ చేశాడు.

క‌ర్ణి సేనకు చెందిన సూరజ్ పాల్ అమ్ము మాట్లాడుతూ, “చావాంకేకి వ్యతిరేకంగా ఒక లాబీ పని చేస్తోంది. ఎవరైనా అతన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మేం మద్దతుగా నిలుస్తాం. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి చవాన్కేకు భారతదేశం నలుమూలల నుండి మద్దతు లభిస్తోంది. మా డిమాండ్ లో అన్యాయమైనది ఏమీ లేదు. దేశ ద్రోహులను, భారత్‌లో తింటూ పాకిస్థాన్‌ను కీర్తించే వారిని తొలగించాలని మాత్రమే మేము అడుగుతున్నాం అన్నారాయన.

దస్నా దేవి ఆలయానికి చెందిన అమృతానంద్ మాట్లాడుతూ చవాన్కే నేతృత్వంలోని సుదర్శన్ న్యూస్ "మా తల్లులు, సోదరీమణులను రక్షించే ఏకైక ఛానెల్" అని అన్నారు.

“మా సోదరుల గొంతులు కోయకుండా నిరోధించడానికి ఇది పనిచేస్తుంది. ఇది 'లవ్ జిహాద్' , 'ల్యాండ్ జిహాద్' సహా అనేక రకాల 'జిహాద్'లను బహిర్గతం చేస్తుంది, ”అని అమృతానంద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మరో వక్త మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం హిందువులది, ముస్లింలది కాదు. అని అంటూ ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

''హిందూ దేశాన్ని డిమాండ్ చేయడం ద్వారా మన సురేష్ చవాన్కే జీ ఏం పాపం చేశాడు? పాకిస్థాన్‌లో హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తామా? మనం హిందుస్థాన్‌లో హిందూ దేశాన్ని డిమాండ్ చేయలేమా? సోదరులారా, సుదర్శన్ న్యూస్ హిందువులకు గొంతునిచ్చే ఛానెల్. విదేశీ శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా సుదర్శన్ ఛానెల్ ఆగదు’’ అని అన్నారు.

సుప్రీం కోర్టు కొలీజియంపై ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు ఘర్షణ వాతావరణం నెల కొన్న నేపథ్యంలో హిందుత్వ సంఘాలు సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం గమనార్హం. సుప్రీం కోర్టు కూడా ఒత్తిడిలో పనిచేయాలని వారి ఉద్దేశమా ?

Tags:    
Advertisement

Similar News