అరుణ్ గోయెల్ నియామక తీరుపై సుప్రీంకోర్టు విస్మయం
న్యాయశాఖ రూపొందించిన నలుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితా నుంచి గోయెల్ పేరును ప్రధానికి, రాష్ట్రపతికి సిఫార్సు చేయడం, అదేరోజు అవి మెరుపు వేగంతో ఆమోదం పొందడం ఓ మాయగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ నియమితులైన తర్వాత.. ఖాళీ అయిన ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయెల్ ఎంపికవ్వడం, దానికి సంబంధించిన దస్త్రాలు వేగంగా కదిలిన తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తన నియామకంపై ముందే తెలియకపోతే భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరుణ్ గోయెల్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ముందుగానే ఎలా దరఖాస్తు చేసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.
గోయెల్ పదవీ విరమణ తేదీ 2022 డిసెంబర్ 31 కాగా.. ఆయన అదే ఏడాది నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకం శరవేగంగా జరిగిపోయింది.
న్యాయశాఖ రూపొందించిన నలుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితా నుంచి గోయెల్ పేరును ప్రధానికి, రాష్ట్రపతికి సిఫార్సు చేయడం, అదేరోజు అవి మెరుపు వేగంతో ఆమోదం పొందడం ఓ మాయగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకానికి కొలీజియం తరహా కమిటీ ఉండాలని, అందులో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న నియామకాల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఈ సందర్భంగా గోయెల్ నియామక తీరును ప్రస్తావించింది.