ఈడీ చీఫ్ కొనసాగింపుపై కేంద్రానికి సుప్రీం షాక్
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమని పేర్కొంది సుప్రీంకోర్టు . జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండకూడదని తేల్చి చెప్పింది.
ఐటీ, ఈడీ, సీబీఐని జేబు సంస్థలుగా మార్చుకున్న కేంద్రం ఆయా సంస్థల అధిపతులుగా కీలుబొమ్మల్ని పెట్టి ఆడిస్తోందనే ఆరోపణలున్నాయి. వాటిని నిజం చేసేలా పదే పదే ఈడీ అధిపతి సర్వీసుని పొడిగిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఇకపై ఈ కొనసాగింపు కుదరదని చెప్పింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమని పేర్కొంది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండకూడదని తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది సుప్రీం.
సంజయ్ పై అమితమైన అభిమానం..
అధికారులెవరైనా అత్యుత్తమ ప్రతిభ చూపెడితే రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి అదే స్థానంలో కొనసాగే అవకాశమిస్తారు నాయకులు. మహా అయితే ఒకటీ రెండేళ్లు ఆ పొడిగింపు ఉంటుంది. కానీ కేంద్రం మాత్రం 2020లో పదవీ విరమణ చేసిన సంజయ్ కుమార్ మిశ్రాని ఈడీ చీఫ్ గా ఇప్పటి వరకూ పొడిగిస్తూ వచ్చింది. ఇకపై కూడా పొడిగించాలనే ఉద్దేశంతో మరోసారి ఆయన్నే ఈడీ అధినేతగా నియమించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ కోర్టుకెక్కారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మిశ్రా వ్యవహారంలో కేంద్రం తీరుని ఆక్షేపించింది. 2021 నవంబర్ లో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది.
ఇప్పటికిప్పుడంటే కుదరదు కదా..!
మిశ్రా స్థానంలో ఇప్పటికిప్పుడు కొత్త వారిని వెదుక్కోవడం కష్టమంటూ సన్నాయి నొక్కులు నొక్కాలని చూసింది కేంద్రం. మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తామంది. కానీ సుప్రీం ససేమిరా అనడంతో కేంద్రం పప్పులు ఉడకలేదు. జులై-31 వరకు ఆయన్ను ఆ పదవిలో కొనసాగనివ్వాలని, ఆలోగా కొత్తవారిని వెదుక్కోవాల్సిందేనని కేంద్రానికి తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.