వలస కార్మికులకు రేషన్ కార్డ్ లు ఇస్తారా..? ఇవ్వరా..?
ఆహార భద్రత చట్టం కింద జనాభా నిష్పత్తి లెక్కలు సరిగా లేవనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు విముఖత చూపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్థానికులు, స్థానికేతరులు అనే విభజన అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుంది. వలస వచ్చినవారెవరైనా కొన్నాళ్లపాటు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారికి స్థానిక ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. మరి వలస కార్మికుల పరిస్థితి ఏంటి..? ఎక్కడో వారి సొంతఊరు. అక్కడ కూడా ఇల్లు, వాకిలి ఉంటుందని చెప్పలేం. పొట్టకూటికోసం ఊళ్లు పట్టుకుని తిరుగుతుంటారు. స్థిరమైన నివాసం ఉండదు, ధృవీకరణ పత్రాలు అసలే ఉండవు. అలాంటి వారికి ప్రభుత్వం రేషన్ సరకులు ఇస్తే ఎంతో ఉపయోగం. కానీ అవసరం ఉన్న అలాంటి వారికి మాత్రం రేషన్ కార్డులు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. రేషన్ సరకులు వారి దరిచేరవు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. దాహంగా ఉన్నవారే బావి దగ్గరకు వెళ్లాలి కానీ బావి.. మనుషుల దగ్గరకు రాదనేది సామెత. కానీ కొన్నిసార్లు బావి కూడా దాహంతో ఉన్నవారి దగ్గరకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.
ఆహార భద్రత చట్టం కింద జనాభా నిష్పత్తి లెక్కలు సరిగా లేవనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు విముఖత చూపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికుల సంక్షేమం కోసం సుప్రీంలో దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కార్మికులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. తుది తీర్పు వాయిదా వేసింది.
సంక్షేమ పథకాల ప్రయోజనాలు పౌరులందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వాలు విధి నిర్వహణలో విఫలమయ్యాయని తాము చెప్పడంలేదని, అయితే కొంతమందికి ఇప్పటికీ ఆ ప్రయోజనాలు అందడంలేదని చెప్పుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించించింది. వల కార్మికులపై సానుభూతి చూపుతాం కానీ, కనీసం వారికి రేషన్ కార్డులు ఇచ్చి, రేషన్ సరకులు ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించింది.