ఈడీ డైరెక్టర్ పదవీకాలం.. కేంద్రానికి సుప్రీం చీవాట్లు

పదే పదే మిశ్రా పదవీకాలం పొడిగించుకుంటూ పోవడం సరికాదంటూనే కేంద్రం వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈడీలో మిశ్రా మినహా అందరూ అసమర్థులే ఉన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోందని మండిపడింది.

Advertisement
Update:2023-07-28 07:26 IST

ఇటీవలే నాగాలాండ్ లో మహిళా రిజర్వేషన్లు అమలు కావడంలేదంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఎందుకంత ఉదాసీనత అంటూ మండిపడింది. వారం తిరక్కముందే మరోసారి కేంద్రానికి సుప్రీం తలంటింది. ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా పదవీకాలం పొడిగిస్తూ.. మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని హెచ్చరించింది. తదుపరి పొడిగింపు కుదరదని తేల్చి చెప్పింది సుప్రీం.

ఈడీ విషయంలో పదే పదే మొట్టికాయలు..

2018 నవంబర్ లో సంజయ్ కుమార్ మిశ్రా ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్రం మూడేళ్లకు పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించడంతో వివాదం మొదలైంది. ఆ పొడిగింపు కూడా ఈ జులై 31కి పూర్తవుతుంది. ఇప్పుడు కూడా ఆయనే ఈడీ డైరెక్టర్ గా ఉండాలంటూ కేంద్రం పట్టుబడుతోంది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. జులై 31లోపు కొత్తవారిని నియమించాలని చెప్పింది సుప్రీం. కానీ కేంద్రం కొత్తవాదన తెరపైకి తెచ్చింది. మరికొద్ది రోజుల్లో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (FATF) బృందం భారత్ కి రాబోతోందని, వారి సమీక్షపై దేశ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎస్కే మిశ్రా పదవీకాలం పొడిగించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్-15 వరకు పొడిగించింది. ఆ తర్వాత మాత్రం ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని తేల్చి చెప్పింది.

సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు..

పదే పదే మిశ్రా పదవీకాలం పొడిగించుకుంటూ పోవడం సరికాదంటూనే కేంద్రం వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈడీలో మిశ్రా మినహా అందరూ అసమర్థులే ఉన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోందని మండిపడింది. ఇది ఈడీ నైతికస్థైరాన్ని దెబ్బతీస్తుందని చెప్పింది. ఒక వ్యక్తి లేకపోతే వ్యవస్థ ఆగిపోతుందన్న సంకేతాన్నివ్వడం సరికాదన్నది. ఇప్పటికైనా కొత్తవారికి అవకాశమివ్వాలని చెప్పింది సుప్రీం.

Tags:    
Advertisement

Similar News