ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ మూడు వారాలు వాయిదా

ఈడీ సమన్లను రద్దు చేయాలని, ఇకపై కవితను ఇంటి వద్దే విచారించేలా ఈడీని ఆదేశించాలని కవిత లాయర్ కపిల్ సిబాల్ సుప్రీంకోర్టును కోరారు.

Advertisement
Update:2023-03-27 14:31 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు తనను విచారణకు పిలిచే అంశంలో నిబంధనలు పాటించలేదని, మహిళకు వర్తించే హక్కులకు భంగం కలిగించారని పేర్కొంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు.

కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్‌కు రావాలని ఆదేశించారని, అసలు ఆమె నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్‌కు ఎలా పిలుస్తారంటూ కపిల్ సిబాల్ ఈడీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు పిలిచే వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఒక సారి పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని, ఇకపై కవితను ఇంటి వద్దే విచారించేలా ఈడీని ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏ కేసుల్లో వర్తించదంటూ ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసుల్లో ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని తెలిపారు. అయితే దీనిపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈడీ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదికి తెలిపింది. ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.  

Tags:    
Advertisement

Similar News