ఆకతాయిల లైంగిక దాడులపై సుప్రీం కోర్టు ఆవేదన
నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయకపోతే వారు ఘటనకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేయడం, సాక్షులను బెదిరించడం, అక్కడి నుంచి తప్పించుకుపోవటం వంటివి జరిగే ప్రమాదం ఉందని తెలిపింది.
మణిపుర్‌లో జరిగిన హింసాత్మక దాడులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గుంపులో ఉండటం వల్ల శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించడంతోపాటు ఓ వర్గంలో అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు, మూకలు లైంగిక దాడులను ఉపయోగిస్తారని తెలిపింది. ఇటువంటి వాటికి ముందు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపు, బాధితుల పునరావాసం, కూల్చిన ప్రార్థనా మందిరాలు, గృహాల పునరుద్ధరణ చేపట్టాలని ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన కమిటీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. మణిపుర్‌లో మహిళలపై జరిగిన లైంగిక దాడుల స్వభావంపైనా విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఆగస్టు 7న ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.
నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయకపోతే వారు ఘటనకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేయడం, సాక్షులను బెదిరించడం, అక్కడి నుంచి తప్పించుకుపోవటం వంటివి జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఇటువంటి వర్గాల దాడులు, మూక దాడులు భారీ స్థాయిలో ఆస్తి నష్టానికి కారణం అవుతాయంది. వాటికి అడ్డుకట్ట వేయడం చట్టబద్ధ పాలన బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా భరోసా కల్పించేందుకే ఇందులో జోక్యం చేసుకుంటున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
మణిపుర్ ఘటనల విషయంలో బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణను, కూల్చిన ఇళ్ళు, ప్రార్థనా మందిరాల పునరుద్ధరణ తదితర చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ జడ్జీలతో కూడిన కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహిస్తున్నారు. బాంబే హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలినీ పి.జోషి, దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆశా మేనన్ సభ్యులుగా ఉంటారు.