విద్వేష‌పూరిత ప్ర‌సంగాలను అడ్డుకోవాలి.. క‌మిటీ ఏర్పాటు చేయండి

కొంద‌రు చేసే ప్ర‌సంగాలు కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల చావుకు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని పిటిష‌న‌ర్ వివ‌రించారు. ఇలాంటి ప్ర‌సంగాల వ‌ల్ల హ‌ర్యానాలో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లో ఆరుగురు మృత్యువాత ప‌డ్డార‌ని తెలిపారు.

Advertisement
Update:2023-08-12 08:08 IST

విద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను అడ్డుకోవాల‌ని సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేవిధంగా విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేయ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ త‌ర‌హా ప్ర‌సంగాల కేసుల‌ను ప‌రిశీలించేందుకు గాను ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ఈ అంశంపై ఓ పాత్రికేయుడు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది. కొంద‌రు చేసే ప్ర‌సంగాలు కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల చావుకు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని పిటిష‌న‌ర్ వివ‌రించారు. ఇలాంటి ప్ర‌సంగాల వ‌ల్ల హ‌ర్యానాలో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లో ఆరుగురు మృత్యువాత ప‌డ్డార‌ని తెలిపారు.

ఇరువైపు వాద‌న‌లూ విన్న జ‌స్టిస్ సంజీవ్ ఖన్నా, జ‌స్టిస్ ఎన్వీఎస్ భ‌ట్టిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం మ‌తాలు, జాతుల మ‌ధ్య సామ‌ర‌స్యం ఉండాల‌ని పేర్కొంది. క‌మిటీ ఏర్పాటుపై ప్ర‌భుత్వ స్పంద‌న‌ను ఆగ‌స్టు 18లోగా కోర్టుకు స్ప‌ష్టంగా చెప్పాల‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిష‌న్‌కు మ‌రింత బ‌లం చేకూరేలా సంబంధిత డాక్యుమెంట్లు, వీడియో ఫుటేజీల‌ను కోర్టు ముందు ఉంచాల‌ని పిటిష‌న‌ర్‌కు సూచించింది. అనంత‌రం త‌దుపరి విచార‌ణ‌ను ఆగ‌స్టు 18కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News