ఆస్తి పంప‌కం స‌మ‌యంలో ఆ ష‌ర‌తు పెట్టండి.. - తల్లిదండ్రులకు సుప్రీం సూచన

పిల్లలకు ఆస్తి రాసిచ్చే సమయంలో వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకోవాలన్న షరతు కచ్చితంగా పెట్టడమే కాకుండా గిఫ్ట్ డీడ్ లో ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా రాయాలని సుప్రీంకోర్టు తల్లిదండ్రులకు సూచించింది.

Advertisement
Update:2022-12-09 15:14 IST

పిల్లలకు ఆస్తి రాసిచ్చే సమయంలో వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకోవాలనే షరతు పెట్టాలని సుప్రీంకోర్టు తల్లిదండ్రులకు సూచించింది. అలా షరతు పెట్టకుండా.. తమ పిల్లలు తమను సరిగా చూసుకోవడం లేదని, వారికి తాము రాసిచ్చిన ఆస్తిని తిరిగి ఇవ్వాలని కోరడం కుదరదని వ్యాఖ్యానించింది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక తల్లిదండ్రులు ఆస్తిని అయితే పంచి ఇస్తారు కానీ, వారిని వృద్ధాప్యంలో పిల్లలు సరిగా చూసుకుంటారన్న నమ్మకం మాత్రం ప్రస్తుతం ఉండటం లేదు. పిల్లలకు ఉన్నదంతా రాసిచ్చి వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

కాగా, గురుగావ్ కు చెందిన ఒక మహిళ తన ఆస్తిని ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి రాసిచ్చింది. అయితే వారు వృద్ధాప్యంలో తనను సరిగా చూసుకోవడం లేదని వారికి రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఆమె రద్దు చేసింది. ఈ విషయమై ఆమె పిల్లలు ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా.. తల్లి నిర్ణయాన్ని సమర్థించింది. పంజాబ్- హర్యానా హైకోర్టు కూడా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఈ వ్యవహారమై సదరు మహిళ పిల్లలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఓకాల లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆస్తి పిల్లలకు దక్కకుండా తల్లి గిఫ్ట్ డీడ్ రద్దు చేయడాన్ని కోర్టు కొట్టివేసింది. పిల్లలకు ఆస్తి రాసిచ్చిన సమయంలో తల్లి తనను వృద్ధాప్యంలో చూసుకోవాలనే షరతు పెట్టలేదని, అందువల్ల ఆమె నిర్ణయాన్ని కొట్టి వేసినట్లు పేర్కొంది.

పిల్లలకు ఆస్తి రాసిచ్చే సమయంలో వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకోవాలన్న షరతు కచ్చితంగా పెట్టడమే కాకుండా గిఫ్ట్ డీడ్ లో ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా రాయాలని సుప్రీంకోర్టు తల్లిదండ్రులకు సూచించింది. అలా లిఖితపూర్వకంగా రాయనప్పుడు పిల్లలు తమను సరిగా చూసుకోవడం లేదంటూ ఇచ్చిన ఆస్తిని తిరిగి పొందే హక్కు ఉండదని కోర్టు అభిప్రాయపడింది.

చివరి దశలో ఆదుకుంటారన్న నమ్మకంతోనే తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లలకు ఇస్తారని.. అయితే పిల్లలు మాత్రం తమ తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. పిల్లలకు ఆస్తి రాసిచ్చే సమయంలో తల్లిదండ్రులు షరతు విధించడం వల్ల మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ -2007 ప్రకారం మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News