టెన్త్, ఇంటర్‌ పరీక్షలు.. ఇకపై ఏడాదిలో రెండుసార్లు.. - 2025–26 నుంచి అమలు

ఈ పరీక్షలు నిర్వహించే క్రమంలో రెండింటిలో ఏది ఉత్తమ స్కోరు అయితే దానిని ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు.

Advertisement
Update:2024-02-20 16:13 IST

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. 2025 అకడమిక్‌ సెషన్‌ నుంచి దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ పరీక్షలు నిర్వహించే క్రమంలో రెండింటిలో ఏది ఉత్తమ స్కోరు అయితే దానిని ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కేంద్ర విద్యావిధానంలో ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుందని ఆయన చెప్పారు.

కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో రూపొందించిన కొత్త కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం.. నూతన విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా.. అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News