భారత్ లో రైతులకంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ
అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం, పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపించలేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
భారత్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అనే విషయం తెలిసిందే. అయితే రైతుల కంటే ఎక్కువగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా దృష్టిపెట్టాలని కోరింది పార్లమెంట్ స్థాయీ సంఘం. రైతుల మరణాలు జాతీయ సంక్షోభంగా భావిస్తున్నామని, విద్యార్థుల మరణాలపై కూడా ఆ స్థాయిలో కలవరపడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది.
2021లో భారత్ లో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 1,64,033
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 10,881
అదే ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 13,089
ఈ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది పార్లమెంట్ స్థాయీ సంఘం. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు 26శాతం పెరిగాయని వివరించింది.
కారణాలేంటి..?
కొవిడ్ సమయంలో విధించిన లాక్ డౌన్ వల్ల జీవనోపాధి, ఆదాయం దెబ్బతినడంతో రోజువారీ కూలీల ఆత్మహత్యలు 14శాతం పెరిగాయని నిరుద్యోగుల ఆత్మహత్యలు 11శాతం పెరిగాయని నివేదికల సారాంశం. అదే సమయంలో అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం, పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపించలేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలు కూడా కొంతవరకు కారణం. కానీ ఎక్కువగా విద్యావిషయక కారణాలే అధికం అని తెలుస్తోంది.
ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేస్తున్నాయి..?
విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చాలా స్వల్పం. ఆత్మహత్యల అనంతరం విచారణలు జరుగుతున్నాయి కానీ, వాటికి గల కారణాలు కనిపెట్టి, నివారణ చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వాలకు ఆసక్తి లేదని తేలింది. దీంతో పార్లమెంట్ స్థాయీ సంఘం కొన్ని సూచనలు చేసింది. UPSC, CSE, NEET, SSC, JEE లాంటి అర్హత పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 24/7 టెలిఫోన్ కౌన్సెలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని తెలిపింది.
మరికొన్ని సూచనలు
- మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు విద్యార్థులకోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- 2030 నాటికల్లా ఆత్మహత్యలను 10 శాతానికి తగ్గించాలని నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్ష్యంగా పెట్టుకోవాలి.
- విద్యార్థుల్లో ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను, కనిపెట్టడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
- మానసిక ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచాలి, స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి.
పార్లమెంట్ స్థాయీ సంఘం ఈ సూచనలను లోక్ సభకు సమర్పించింది.