ఇన్వెస్టర్లను నిరాశ పరిచిన సార్వత్రిక ఫలితాలు.. 4100 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాస్!
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో మదుపర్లు రూ.21 లక్షల కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం బాగానే పడింది. ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 300 స్థానాలకు చేరువలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమి అధికార కూటమికి గట్టి పోటీ ఇస్తున్నది. ఓట్ల లెక్కింపు వేళ మంగళవారం ఉదయం 11.30 గంటల సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 3400 పాయింట్లు పతనమైంది. ఒకానొక దశలో సెన్సెక్స్ 4100 పాయింట్ల వరకూ పతనమైంది. ఎన్డీఏ కూటమికి అంచనా మేరకు సీట్లు రాకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 3200 పాయింట్లకు పైగా నష్టంతో 73,250 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 22,200 పాయింట్ల నడుస్తున్నది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 6 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 11 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 9 శాతం నష్టపోయాయి. అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమి.. అధికార ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో మదుపర్లు రూ.21 లక్షల కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. దేశీయ ఇండెక్స్‌లు పతనం కావడం, అధికార ఎన్డీఏ కూటమి అంచనాల మేరకు 400 స్థానాల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ 83.34 వద్ద పతనమైంది. 10 ఏండ్ల ప్రభుత్వ బాండ్లు ప్రారంభ ట్రేడ్‌లో ఏడు శాతం లాభాలతో ట్రేడయ్యాయి. ఎన్డీఏ 400కి పైగా స్థానాలు సాధిస్తుందన్న అంచనాల మధ్య ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ 82.96లకు పుంజుకున్నది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఫారెక్స్ మార్కెట్‌లో గత డిసెంబర్ 15 తర్వాత రూపాయి పుంజుకోవడం ఇదే మొదటి సారి.