ఓ భార్యతో 3 రోజులు, మరో భార్యతో 3 రోజులు ఉండు.. ఓ భర్తకు ఫ్యామిలీ కోర్టు ఆదేశం
ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గ్వాలియర్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త, ఇద్దరు భార్యలను పిలిపించిన కౌన్సెలింగ్ ఇచ్చే వ్యక్తి హరీష్ దివాన్ ముగ్గురితో చర్చలు జరిపాడు.
ఇప్పుడైతే రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు పెద్దగా కనిపించడం లేదు కానీ, గతంలో అయితే రెండు వివాహాలు చేసుకున్న వారు ఎక్కువగానే ఉండేవారు. ఇద్దరు భార్యలు ఒక ఇంట్లో ఉంటూ వారు పడే గొడవలు చూడలేక ఒకరిని ఒక ఇంట్లో మరొకరిని వేరొక ఇంట్లో పెట్టడం, వారి వారి ఇళ్లలో సమాన రోజులు ఉండటం చేసేవారు. ఇప్పుడు గ్వాలియర్ కు చెందిన ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలకు న్యాయం చేసేందుకు ఒక్కో భార్య వద్ద వారంలో మూడు రోజులు గడపాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
గ్వాలియర్ కు చెందిన ఓ వ్యక్తి హర్యానాలోని మల్టీ నేషనల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికే చెందిన మహిళతో పెళ్లి జరిగింది. 2020లో కరోనా విజృంభించిన సమయంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి పంపించాడు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక్కడే హర్యానాకు వెళ్ళాడు. భార్య మాత్రం పుట్టింటిలోనే ఉండిపోయింది.
ఇదిలా ఉండగా ఆ మహిళ భర్త తాను పనిచేస్తున్న కంపెనీలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. హర్యానాలోనే కాపురం కూడా పెట్టాడు. లాక్ డౌన్ తొలగించి నెలలు గడిచినా భర్త తనను తీసుకువెళ్లడానికి రాకపోవడంతో మొదటి భార్య స్వయంగా హర్యానాకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తన భర్త మరో వివాహం చేసుకున్నట్లు ఆమెకు తెలిసింది.
ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గ్వాలియర్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త, ఇద్దరు భార్యలను పిలిపించిన కౌన్సెలింగ్ ఇచ్చే వ్యక్తి హరీష్ దివాన్ ముగ్గురితో చర్చలు జరిపాడు. ఓ పరిష్కార మార్గాన్ని చూపించాడు. ఈ ప్రకారం భర్త వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద, మరో మూడు రోజులు ఇంకో భార్య వద్ద ఉండాల్సి ఉంటుందని.. ఆదివారం భర్త తనకు నచ్చిన చోట ఉండొచ్చని సూచించాడు. కౌన్సెలింగ్ ఇచ్చిన హరీష్ సూచనకు ఇద్దరు భార్యలు అంగీకరించారు. ఇదిలా ఉండగా ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భర్త తన భార్యలు ఇద్దరికీ చెరొక ఫ్లాట్ కొని కానుకగా ఇచ్చాడు.