డ్యాన్స్ చేస్తే జీఎస్టీ.. దసరాని క్యాష్ చేసుకుంటున్న కేంద్రం..
నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే గార్భా నృత్య ప్రదర్శనలపై జీఎస్టీ విధించేందుకు కేంద్రం నిర్ణయించింది. గుజరాత్ లోని బీజేపీ సర్కారు కూడా దీనికి సై అంది. దీంతో వెంటనే జీఎస్టీ అమలులోకి వచ్చేసింది.
గతంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులు, సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు జీఎస్టీ లేని అరుదైన వస్తువులేవీ ఈ భూమిపై లేవని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. తాజాగా దసరాకి సరదాగా చేసే నృత్యంపై కూడా జీఎస్టీ విధించి తన నైజాన్ని చాటుకుంది. గార్భా నృత్యంపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలంటూ గుజరాత్ లో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి.
నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే గార్భా నృత్య ప్రదర్శనలపై జీఎస్టీ విధించేందుకు కేంద్రం నిర్ణయించింది. గుజరాత్ లోని బీజేపీ సర్కారు కూడా దీనికి సై అంది. దీంతో వెంటనే జీఎస్టీ అమలులోకి వచ్చేసింది. గార్భా ఎంట్రీ పాస్ లపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గార్భా నృత్యం చేసేటప్పుడు ధరించే ఛనియా చోలీ డ్రెస్ పై కూడా 5 నుంచి 12 శాతం వరకు జీఎస్టీ విధించారు. చోలీ డ్రెస్ ధర వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉంటే 5శాతం జీఎస్టీ, వెయ్యి రూపాయలకంటే రేటు ఎక్కువ అయితే 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డ్యాన్స్ ఎంట్రీ పాస్ తోపాటు, డ్యాన్స్ డ్రస్ పై కూడా జీఎస్టీ విధించి తమాషా చూస్తోంది కేంద్రం.
దసరా సందర్భంగా మండపాల వద్ద గార్భా నృత్యం ఆడతారు. కొంతమంది కమర్షియల్ గా వీటిని నిర్వహిస్తుంటారు. ఇలా కమర్షియల్ గార్భా డ్యాన్స్ ప్రదర్శనల ఎంట్రీ పాస్ లపై ప్రభుత్వం జీఎస్టీ విధిస్తోంది. వడోదరలో లక్ష పాస్ లు ఉంటాయి. 18 శాతం జీఎస్టీ అంటే.. నిర్వాహకులు అదనంగా కోటిన్నర రూపాయలకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆమేరకు నిర్వాహకులు పాస్ ల ధర పెంచలేరు, అలాగని ప్రభుత్వానికి అదనంగా కోట్ల రూపాయలు చెల్లించుకోనూ లేరు. దీంతో ఈ జీఎస్టీని తట్టుకోలేమని వాపోతున్నారు నిర్వాహకులు. నిరసనలకు దిగారు.
ఆందోళన ప్రదర్శనలు..
గార్భాపై పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వడోదరలో జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సూరత్ ప్రజలు గార్భా ఆడుతూ నిరసన చేపట్టారు. గార్భా అనేది గుజరాత్ సంస్కృతి, సంప్రదాయం అని, దానిపై జీఎస్టీ వేయడం సరికాదని మండిపడ్డారు.