ఒక హిందూ అమ్మాయికి బదులుగా పదిమంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి - శ్రీరామసేన చీఫ్

ప్రస్తుతం దేశంలో వేలాదిమంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ కు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారని చెప్పారు.

Advertisement
Update:2023-02-20 15:30 IST

అమ్మాయి అబ్బాయి ఏ మతానికి చెందిన వారైనా వారిద్దరూ మేజర్ అయితే, మనస్పూర్తిగా ప్రేమించుకొని ఉంటే వారి వివాహాన్ని ఈ దేశంలోని చట్టాలు అంగీకరిస్తాయి. విజ్ఞులైన వారు మతాలతో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య ప్రేమను, పెళ్లిని ఆహ్వానించాలి. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రేమ పేరుతో మతాల కోసం అమ్మాయిలను ట్రాప్ చేయాలని పిలుపునివ్వడమే ఆందోళన కలిగించే అంశం.

తాజాగా కర్ణాటకలో శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముథలిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రమోద్ అక్కడ మతాలవారీగా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీరామసేన చీఫ్.. హిందూమతంలోని యువకులకు ఒక పిలుపునిచ్చారు. హిందూమతంలోని యువకులు ముస్లిం అమ్మాయిలను ప్రేమలోకి దింపితే అలా చేసిన వారికి శ్రీరామసేన అన్ని విధాలుగా రక్షణ కల్పించడంతోపాటు ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తుందని ప్రకటించారు.

ప్రస్తుతం దేశంలో వేలాదిమంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ కు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హిందూ అమ్మాయి లవ్ జిహాద్ కు గురైతే.. అందుకు ప్రతిగా పదిమంది ముస్లిం అమ్మాయిలను హిందూ యువకులు ప్రేమలోనికి దింపాలని పిలుపునిచ్చారు.

ఒక హిందూ అమ్మాయికి బదులుగా పదిమంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయడమే సరైన సమాధానమని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని కర్కల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన కర్ణాటక బిజెపి ప్రభుత్వంపైన విమర్శలు చేశారు.

బిజెపిది నకిలీ హిందుత్వ వాదమని విమర్శించారు. తనపై అత్యధికంగా కేసులు బిజెపి పాలనలోనే నమోదయ్యాయని చెప్పారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతానని చెప్పారు. తాను బిజెపి నకిలీ హిందుత్వ వాదానికి మద్దతుగా నిలిస్తే తనకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని, కానీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి నకిలీ హిందుత్వ వాదాన్ని సమర్థించబోనన్నారు ప్రమోద్.

Tags:    
Advertisement

Similar News