సంగీతం ద్వారా విద్వేషం వ్యాప్తి.. ఒక వర్గం టార్గెట్‌గా పాటలు!

సందీప్ ఆచార్య వంటి వారైతే ఇంకాస్త దూకుడుగా లిరిక్స్ రాస్తున్నారు. హిందువులు అడుగు పెట్టలేని వీధి లేదు అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పాటల విడుదల చేస్తున్నారు.

Advertisement
Update:2023-06-16 17:09 IST

విద్వేషం అనే బజారులో ప్రేమ అనే దుకాణం తెరిచాను.. అంటూ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి మతం, కులం ప్రాతిపదికన ప్రజలు విడిపోయారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ అనేక మాధ్యమాల ద్వారా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలకు ఏకంగా ప్రధాని మోడీ వంటి నాయకులే ప్రచారం చేయడం బాధాకరమైన విషయం. ఇన్నాళ్లూ సినిమాలకు పరిమితం అయిన విద్వేషాన్ని.. ఇప్పుడు సంగీతం రూపంలో వ్యాప్తి చేస్తున్నారు. లక్షలాది మంది ఆ పాటలను ఆస్వాదిస్తుండటం ఆందోళనకు గురి చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కాలంలో హిందుత్వ సపోర్టర్స్ అయిన ఉపేందర్ రాణా, సందీప్ ఆచార్య, ప్రేమ్ క్రిష్ణవంశీ వంటి వారు తమ పాటలతో పాపులర్ అయ్యారు. ఏ పండుగ అయినా, రాజకీయ ర్యాలీ అయినా, రామనవమి వేడుకలు అయినా లేదంటే హిందూ యువ వాహిని కార్యక్రమాలు అయినా వీరి పాటలతో మార్మోగిపోతోంది. అయితే వారి పాటల్లో పూర్తిగా విద్వేషాన్ని రగిలించేలా లిరిక్స్ ఉంటున్నాయి. 'ధర్మ్ కి ఖత్రీ ఆగే బడాకే అబ్ హతియార్ ఉఠావో' (ధర్మం ప్రమాదంలో ఉంది. వెళ్లి ఆయుధాలు చేపట్టండి).. 'ఇన్‌సాన్ నహీహో సాలో, తుమ్ హో కసాయి.. బహుత్ హువా హిందూ - ముస్లిం భాయి భాయి' (మీరు మనుషులు కాదు కసాయిలు.. ఇక చాలు హిందూ ముస్లిం భాయి భాయి) అంటూ పాటలు రాసి వాటిని పాపులర్ చేస్తున్నారు. ఒక విధంగా హింసను ప్రేరేపించేలా ఈ హిందుత్వ పాటలు ఉంటున్నాయి.

సందీప్ ఆచార్య వంటి వారైతే ఇంకాస్త దూకుడుగా లిరిక్స్ రాస్తున్నారు. హిందువులు అడుగు పెట్టలేని వీధి లేదు అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పాటల విడుదల చేస్తున్నారు. ఈ పాటల్లో ఎలాంటి సంగీతం, మెలొడీ ఉండదు. కేవలం తాము చేయాలనుకున్న విద్వేష ప్రచారాన్ని పూర్తి చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు, యువత మనసులో నాటుకొని పోతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అభిమానులు, హిందూ జాతీయవాదులు ఇలాంటి పాటలకు పెద్ద ఫ్యాన్స్‌గా ఉన్నారు. విద్వేషపూరిత పాటలను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్స్‌కు వేలాది మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటున్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ పశ్చిమ జిల్లాలలో ఉపేంద్ర రాణా అనే సింగర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. దాద్రిలోని రసూల్‌పూర్‌కు రాణా స్వస్థలం. అయితే ఇదే ఊరిలో 2015లో మహ్మద్ అఖ్లక్ అనే వ్యక్తిని ఒక గుంపు గోవధ చేశాడనే అనుమానంతో దారుణంగా హతమార్చారు. అప్పట్లో ఆయుధాలు పట్టండి.. మన మతాన్ని రక్షించండి అంటూ రాణా పాటలు రాసి యువతను రెచ్చగొట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు రాణా పెద్ద ఫ్యాన్. చాలా మంది స్థానిక రాజకీయ నాయకులు రాణాను తమ ర్యాలీలు, ఫంక్షన్లకు పిలిపించుకొని ఇలాంటి పాటలను పాడించుకుంటారు.

దాద్రిలో అఖ్లక్ ఘటన తర్వాత హిందుత్వ పాప్‌ను పాపులర్ చేయడం చాలా సులభమని రాణా గ్రహించినట్లు తెలుస్తున్నది. తన పాటల్లో ఎప్పుడు హిందువులను 'మనం'.. మస్లింలను 'వాళ్లు' అని సంబోధిస్తూ.. ఇరు వర్గాలు అసలు ఎన్నటికీ కలవని రీతిగా విద్వేషాన్ని తన పాటల్లో ప్రచారం చేస్తున్నాడు. 2010 వరకు రాణా తన పాటల్లో ఎక్కువగా ఠాకూర్ లేదా క్షత్రియ కులానికి చెందిన వారిని ప్రస్తుతిస్తూ పాటలు పాడేవారు. ఠాకూర్లు నిజమైన మగాళ్లు అనే రీతిలో ఆయన పాటలు సాగేవి. తన ముస్లిం ద్వేషానికి తొలుత ఠాకూర్ కమ్యూనిటీ పాటలను వాడుకున్నాడు. దాస్నా దేవి ఆలయం ప్రధాన పూజారి యతి నర్సింగానంద్ తన గురువుగా రాణా చెప్పుకుంటాడు. నర్సింగానంద్ సభల్లో రాణా పాటలు పాడుతుంటాడు. ప్రస్తుతం రాణా యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. తరచూ తన పాటల్లో హింసను ప్రోత్సహిస్తూ.. ముస్లింలను బహిష్కరించాలనే రీతిలో పాటలు రాస్తుంటాడు. నర్సింగానంద్ అయితే దాస్నా దేవి ఆలయ పరిసరాల్లోకి ముస్లింలను రానివ్వకూడదని తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటాడు. 2021లో ఒక టీనేజ్ ముస్లిం కుర్రాడు దేవాలయ ఆవరణలోకి నీళ్లు తాగేందుకు వచ్చాడని విపరీతంగా కొట్టాడు.

విద్వేష ప్రచార పాటల్లో తానే ముందుండాలని రాణా ఎప్పుడూ పోటీ పడి పాటలు రిలీజ్ చేస్తుంటాడు. ఈ జానర్‌లో పాటలు రాసే, పాడే ప్రతీ సింగర్ టార్గెట్ కూడా అదే. క్రిష్ణవంశీ అనే వ్యక్తి.. భారత్ హిందువులది.. ముస్లింలారా పాకిస్తాన్ వెళ్లిపోండి అనే రీతిలో పాటలు పాడుతుంటాడు. ఈ పాట అతడికి చాలా పాపులారిటీని తీసుకొని వచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్ సింగర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ.. హిందుత్వ పాప్ ఇప్పుడు అతడిని రాత్రికి రాత్రే సెలెబ్రిటీని చేసింది. కాషాయ వీరులారా మనం సింహాలం అనే పాటకు 4.6 లక్షల వ్యూస్ ఉన్నాయి. క్రిష్ణవంశీ తన పాటలను ఎక్కువగా సీఎం ఆదిత్యానాథ్‌కు అంకితం ఇస్తుంటాడు. ఆదిత్యానాథ్ పుట్టిన రోజు నాడు కూడా ఒక పాటను తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు.

ఇక సందీప్ ఆచార్య అనే సింగర్ మైనార్టీలనే టార్గెట్‌గా చేసుకొని విద్వేషపూరిత పాటలు విడుదల చేస్తుంటాడు. 'అయోధ్య మీ అబ్బది కాదు' అనే ఒక పాట యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆచార్య పాటలు చాలా పాపులర్. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో ఆచార్య పాటలు ఊరూరా మార్మోగిపోతుంటాయి.

లక్ష్మీదూబే అనే మహిళ.. స్థానిక హిందీ న్యూస్ పేపర్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించింది. కానీ ప్రస్తుతం హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించే పాటలను తన కెరీర్‌గా ఎంచుకున్నది. చాలా దూకుడుగా పాటలు పాడుతూ.. రెచ్చగొట్టే లిరిక్స్‌తో.. స్టేజీపై కాషాయం రంగు బట్టలు ధరించి.. ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకొని వెళ్తుంది. చాలా సార్లు కత్తులు, తుపాకులు, లాఠీలు చూపిస్తూ.. పాటలు పాడుతుంది. సంగీతం ద్వారా సమాజాన్ని పూర్తిగా విడగొట్టొచ్చు అనుకుంటే.. అందులో దూబే చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పుకుంటారు.

ఇలా హిందుత్వ పాప్ అనే పేరుతో విద్వేషపూర్వక పాటలు పాడుతున్నా.. బహిరంగంగానే విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. లక్షలాది మంది ఇలాంటి విద్వేషాన్ని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఈ హిందుత్వ పాప్‌ను ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్‌లో భారత సమాజం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Tags:    
Advertisement

Similar News