కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం
దేశానికి స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయినందుకు గుర్తుగా దీని డినామినేషన్ రూ.75గా పెట్టినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28 (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణేన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశానికి స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయినందుకు గుర్తుగా దీని డినామినేషన్ రూ.75గా పెట్టినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
కొత్త రూ.75 నాణేనికి ఒక వైపు అశోక స్తంభంపై ఉండే లయన్ క్యాపిటల్ గుర్తు ఉంటుంది. దాని కింద 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది. ఇక ఎడమ వైపు 'భారత్' అనే పదాన్ని దేవనాగరి లిపిలో రాశారు. కుడివైపు ఇంగ్లీషులో 'ఇండియా' అని రాశారు. అంతే కాకుండా కాయిన్ డినామినేషన్ అయిన '75'ను ఇంటర్నేషనల్ న్యూమర్స్‌లో లయన్ క్యాపిటల్ (సింహం గుర్తు) కింద ముద్రించారు. దీనికి ముందు రూపాయి గుర్తు కూడా ఉంటుంది.
నాణేనికి మరోవైపు కొత్త పార్లమెంట్ భవన సముదాయానికి సంబంధించిన చిత్రం ఉంటుంది. దీనిపైన 'సంసంద్ సంకుల్' అని దేవనాగరి లిపిలో రాశారు. కింద 'పార్లమెంట్ కాంప్లెక్స్' అని ఇంగ్లీషులో ముద్రించారు. గుండ్రంగా ఉండే ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. నాణెం చివర్లో 200 సర్రేషన్స్ (వంపుల మాదిరిగా) వచ్చేలా రూపొందించారు. కొత్త నాణెం బరువు 35 గ్రాములు ఉంటుంది. దీనిలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉపయోగించారు.