బీజేపీ ఎత్తుకు పైఎత్తు...జార్ఖండ్ లో సెప్టెంబ‌ర్ 5న విశ్వాస ప‌రీక్ష‌కు సోరేన్ నిర్ణ‌యం

తమ ప్రభుత్వాన్ని కూల దోయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు వెళ్ళనున్నాడు. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సోరెన్ నిర్ణయించారు.

Advertisement
Update:2022-09-02 13:37 IST

జార్ఖండ్ లో జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు బిజెపి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న వాద‌న‌ల నేప‌ద్యంలో కాషాయ పార్టీకి గ‌ట్టిగా బుద్ధి చెప్పేందుకు ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఢిల్లీలో బిజెపి కుట్ర‌ల‌ను ఆప్ ప్ర‌భుత్వం తిప్పికొట్టిన విధంగానే తాము కూడా విశ్వాస ప‌రీక్ష ద్వారా బిజెపి కుయుక్తుల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ నిర్ణ‌యించుకున్నారు.

గ‌నుల కాంట్రాక్ట్ పేరుతో ముఖ్య‌మంత్రి సోరేన్ ను ఎమ్మెల్యేగా అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తార‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ కు నివేదిక ఇచ్చింద‌ని లీకులు వ‌స్తున్నాయి. దీనిపై యుపిఎ కూట‌మి ఎమ్మెల్యేలంతా నిన్న గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ ను క‌లిసి ఇటువంటి లీకులు రాకుండా ఆపాల‌ని కోరారు. అయితే త‌మ కార్యాల‌యం నుంచి ఈ వార్త‌లు బ‌య‌టికి రాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. మొత్తం ఈ వ్య‌వ‌హారంపై రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త ఇస్తాన‌ని కూడా హ‌మీ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా ఈ రాజ‌కీయ దోబూచులాట‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు పొడిగింపుగా మ‌రుస‌టి రోజు ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఆలంగిర్ ఆలం చెప్పారు. మంత్రి వ‌ర్గం స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ నిర్ణ‌యాన్ని వెలిబుచ్చార‌ని ఆయ‌న తెలిపారు. ఇందుకోసం సెప్టెంబ‌ర్ 5వ తేదీన ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్ణీత తేదీ కంటే ఒకరోజు ముందే వాయిదా పడడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి పరిస్థితిపై ఈ సందర్భంగా చర్చించి సభ విశ్వాసాన్ని ప్రభుత్వం పొందుతుందని ఆలం చెప్పారు.

ఇదిలా ఉండ‌గా, యుపిఎ ఎమ్మెల్యేలు దీపికా పాండే, సుదివ్య కుమార్, భూషణ్ బారా, స్టీఫెన్ మరాండి మాట్లాడుతూ ... ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుటిల ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బిజెపి ఇటువంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డం సిగ్గుచేటు అన్నారు. యుపిఎ ఎమ్మెల్యేలు పిక్నిక్ లో ఎంజాయ్ చేస్తున్నారంటూ బిజెపి నేత‌లు విమ‌ర్శించ‌డంపై న‌లుగురు ఎమ్మెల్యేలు తిప్పి కొట్టారు. ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే అర్హ‌త బిజెపి నేత‌ల‌కి లేద‌ని మండిప‌డ్డారు. ఇటువంటి ప్ర‌శ్న‌లు విమ‌ర్శ‌లు అస్సాం ఎపిసోడ్ లో ఎందుకు రాలేదో అంటూ ఎద్దేవా చేశారు. మ‌హారాష్ట్ర‌లో ఉద్ధ‌వ్ నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ఏక్ నాథ్ షిండే ఆధ్వ‌ర్యంలో శివ‌సేన‌లో చీలిక తెచ్చి ఎమ్మెల్యేల‌ను బిజెపి అస్సోం కు త‌ర‌లించింద‌ని అన్నారు. కానీ తామంతా బిజెపి కుట్ర‌ల‌ను తిప్పి కొట్టేందుకు సొంత ఖ‌ర్చుల‌పై రిసార్టుకు వ‌చ్చామ‌న్నారు. ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ఎంతో ఉత్సాహం గా ఉంద‌న్నారు. మా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ప్ర‌జ‌లు ఎంతో సంతోషిస్తున్నారు. వారి సంతోషంలో పాలుపంచుకోలేక‌పోతున్నందుకు బాధ‌గా ఉంద‌ని పాండే చెప్పారు. మేమంతా నిజాయితీ గ‌ల ఎమ్మెల్యేలం. మాకు ఎవ‌రి సొమ్ము అవ‌స‌రంలేదు అన్నారు. బిజెపి మీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు జ‌వాబిస్తూ.. మీ ఇంట్లో దొంగ‌లు ప‌డ‌తార‌ని తెలిసిన‌ప్పుడు ఇంటికి గ‌ట్టి తాళాలు వేస్తారు క‌దా అంటూ బిజెపి ప్ర‌య‌త్నాల‌ను ప‌రోక్షంగా దీపికా పాండే ఎండ‌గ‌ట్టారు.

Tags:    
Advertisement

Similar News