భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
భారత్ జోడో యాత్రలో ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లా నుంచి భారత్ జోడో యాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమైంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. విజయదశమి, దసరా పండుగల దృష్ట్యా రెండు రోజుల విరామం తర్వాత కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లా నుంచి భారత్ జోడో యాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమైంది.
యాత్రలో పాల్గొనేందుకు జకన్న హళ్లి చేరుకున్న సోనియా.. మాండ్యా జిల్లాలోని పాండపుర తాలూకా నుంచి ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన యాత్రలో పాలుపంచుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు నాగమంగళ తాలూకాలో యాత్ర ముగుస్తుంది. అనంతరం బ్రహ్మదేవరహళ్లి మీటింగులో సోనియా పాల్గొంటారు.
కర్నాటకలో ఏడవ రోజులోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర 21 రోజుల పాటు 511 కిలోమీటర్లు కర్నాటకలో కొనసాగనుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్యా, టుముకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగుతుంది.