మొబైల్ వాడొద్దని మందలించినందుకు తల్లిని కొట్టి చంపిన కొడుకు
63 ఏళ్ల మహిళ తన కొడుకు ఎప్పుడు మొబైల్ పట్టుకునే ఉంటున్నాడని ఆగ్రహించింది. మొబైల్ మానకపోతే బాగుపడవు అంటూ గట్టిగా మందలించింది.
కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని మందలించినందుకు ఓ యువకుడు కన్నతల్లి మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే నిందితుడు మానసిక వ్యాధిగ్రస్తుడని భావించిన కోర్టు అతడిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన కన్నూర్ జిల్లా కినిచిరా గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 63 ఏళ్ల మహిళ తన కొడుకు ఎప్పుడు మొబైల్ పట్టుకునే ఉంటున్నాడని ఆగ్రహించింది. మొబైల్ మానకపోతే బాగుపడవు అంటూ గట్టిగా మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కొడుకు తల్లి తలను గోడకేసి బాదాడు. స్థానికులు అది గమనించి వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చాలా రక్తం పోయింది. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. సుమారు వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ తల్లి పరిస్థితులు విషమించి కన్నుమూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ కుమారుడు సుజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను మొబైల్ ఫోన్ తరుచూ వాడుతున్నందున తల్లి ప్రశ్నించిందని, ఆగ్రహంతో తల్లిపై దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు. తానేమి చేస్తున్నానో తెలియని స్థితిలో అలా చేసినట్టు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి వైద్య నివేదికను, అతని చర్యలను కూడా కోర్టు పరిశీలించింది. యువకుడిని జైలుకు పంపే బదులు మానసిక ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.