రమ్మీ ఆడటం ఎలా..? ఆరో తరగతి పాఠం
తమిళనాడులో విద్యాశాఖ అత్యుత్సాహంతో ఆరో తరగతిలో ఆన్ లైన్ రమ్మీ ఆడటం ఎలా అనే పాఠ్యాంశాన్ని పొందుపరిచింది. ఆరో తరగతి లెక్కల పుస్తకంలో ఇదో కొత్తపాఠం.
కూడికలు, తీసివేతలు, గుణాకారాలు, భాగహారాలు.. ప్రాథమిక తరగతుల లెక్కల పుస్తకాల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత వడ్డీ లెక్కలు మొదలవుతాయి. హైస్కూల్ స్థాయిలో సమీకరణాలు, సంఖ్యా శాస్త్రం.. ఇలా రకరకాల పాఠ్యాంశాలు మొదలవుతాయి. అయితే తమిళనాడులో విద్యాశాఖ అత్యుత్సాహంతో ఆరో తరగతిలో ఆన్ లైన్ రమ్మీ ఆడటం ఎలా అనే పాఠ్యాంశాన్ని పొందుపరిచింది. ఆరో తరగతి లెక్కల పుస్తకంలో ఇదో కొత్తపాఠం. ఇప్పటికే దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ఆన్ లైన్ రమ్మీపై డీఎంకే ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ.. జాతీయ స్థాయిలో దానిపై నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో ఆన్ లైన్ గేమింగ్ ని నిషేధించింది. వాటికి బానిసై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయని స్టాలిన్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఇప్పుడు ఆన్ లైన్ రమ్మీ పాఠాన్ని ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
అంతా ఆయన నిర్ణయమే..
డీఎంకే హయాంలో తమిళనాడు పాఠ్యపుస్తకాల సంఘం అధ్యక్షుడిగా ఆ పార్టీకి చెందిన ఐ.లియోని నియమితులయ్యారు. ఆయన హయాంలో ఈ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. రమ్మీ ఆటను విద్యా రంగమే నేర్పేందుకు ఈ పాఠం ఉపోద్ఘాతం, వివరణ ఇస్తుంది. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఈ అంశాన్ని తొలగించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఈ సబ్జెక్ట్ ని చేర్చామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రమ్మీ గేమ్ కు సంబంధించిన సబ్జెక్ట్ ని పూర్తిగా తొలగిస్తామని విద్యాశాఖ తెలిపింది.