రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సు.. నాసిక్స్ వైపుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 25 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవదహనమైన ఘటనను మరువకముందే అదే జిల్లాలో శనివారం మరో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 32 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సు.. నాసిక్స్ వైపుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.