మాకు పెన్షన్ ఇస్తేనే ఓటేస్తాం.. హర్యానాలో బ్రహ్మచారుల షరతు

పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ బ్రహ్మచారులకు పెన్షన్ సక్రమంగా అందడం లేదు. ఈ నేపథ్యంలో హర్యానాలో ఈనెల 25న జరిగే ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కడి బ్రహ్మచారులు షరతు పెట్టారు.

Advertisement
Update:2024-05-18 11:43 IST

తమకు నెలనెలా సక్రమంగా పెన్షన్ అందజేస్తేనే ఓటేస్తామని హర్యానాలోని బ్రహ్మచారులు షరతు పెట్టారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హర్యానాలో బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువే. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గతేడాది బ్రహ్మచారులకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు. హర్యానాలోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అవివాహిత పురుషులు, మహిళలకు.. రూ.1.80 లక్షల కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్నవారికి నెలకు రూ.2,750 పెన్షన్ అందజేస్తాన‌ని ప్రకటించారు.

అయితే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ బ్రహ్మచారులకు పెన్షన్ సక్రమంగా అందడం లేదు. ఈ నేపథ్యంలో హర్యానాలో ఈనెల 25న జరిగే ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కడి బ్రహ్మచారులు షరతు పెట్టారు. బ్రహ్మచారుల గణన చేపట్టాలని, తమకు నెలనెలా పెన్షన్ సక్రమంగా అందజేస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఓటేస్తామని షరతు పెట్టారు. లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.

తాము అవమానకర జీవితాన్ని అనుభవిస్తున్నామని, తమకు ఇంకా పెళ్లి కాలేదని, అందరూ హేళన చేస్తుంటారని వారు వాపోయారు. హర్యానా ప్రభుత్వం అవివాహితులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఆ రాష్ట్రంలోని చెట్లకు కూడా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. 75 సంవత్సరాలు నిండిన చెట్లకు వాటి బాగోగుల కోసం నెలకు రూ.2,750 పెన్షన్ అందజేస్తోంది. తాము పెంచుతున్న చెట్టుకు 75 సంవత్సరాలు నిండినట్లు దరఖాస్తు చేసుకున్న యజమానులకు ఈ పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.

Tags:    
Advertisement

Similar News