నన్ను పోలీసులు అనేక చిత్రహింసలు పెట్టారు ...జర్నలిస్టు సిద్దక్ కప్పన్

తాను పోలీసు కస్టడీలో, జైలులో ఉన్నప్పుడు పడ్డ‌ కష్టాలను కప్పన్ వివరించాడు. పోలీసులు తనను కనికరం లేకుండా కొట్టారని, విచారణలో అసంబద్ధ ప్రశ్నలు అడిగారని ఆరోపించారు.

Advertisement
Update:2023-02-05 06:00 IST

మావోయిస్టులు లేదా ఇతర తీవ్రవాద గ్రూపులతో తనకు సంబంధాలున్నాయని ఒప్పుకోవాలంటూ పోలీసులు తనను హింసించారని జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ వెల్లడించారు.

రెండు సంవత్సరాల నాలుగు నెలలు జైల్లో ఉన్న తర్వాత ఫిబ్రవరి 2 న జైలు నుండి కప్పన్ బెయిల్ పై బయటకు వచ్చారు.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిని అగ్రవర్ణపురుషులు అత్యాచారం చేసి , హత్యచేసిన సంఘటననురి పోర్ట్ చేయడానికి హత్రాస్ వెళ్తుండగా కప్పన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), మనీ లాండరింగ్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించగా, కప్పన్ ఆరోపణలను ఖండించాడు.

కప్పన్ బెయిల్ షరతులో భాగంగా వచ్చే ఆరు వారాల పాటు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండనున్నారు.

తనపై మోపిన దేశద్రోహం, మనీలాండరింగ్ , కుట్ర ఆరోపణల గురించి కప్పన్ మాట్లాడుతూ, హత్రాస్ కేసులో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తనను జైలులో పెట్టిందని కప్పన్ అన్నారు. "తనపై వచ్చిన ఆరోపణల నుండి తప్పించుకోవడానికి, ప్రభుత్వం నన్ను బలిపశువుగా చేసింది. అత్యాచారం, హత్య సంఘటనకు మత రంగులు వేయడానికి ప్రయత్నించింది," అని అతను చెప్పాడు.

కప్పన్ ప్రకారం, అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. అతను ఎప్పుడూ PFI లేదా మరే ఇతర తీవ్రవాద సంస్థలో సభ్యుడు కాదు. అతను "నకిలీ జర్నలిస్ట్" అనే ఆరోపణ గురించి అడిగినప్పుడు, తాను కేరళ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (KUWJ) కార్యదర్శి అని చెప్పాడు. తన ప్రెస్‌ ఐడెంటిటీ కార్డులను పోలీసులు లాక్కున్నారని, ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.

తాను పోలీసు కస్టడీలో, జైలులో ఉన్నప్పుడు పడ్డ‌ కష్టాలను కప్పన్ వివరించాడు. పోలీసులు తనను కనికరం లేకుండా కొట్టారని, విచారణలో అసంబద్ధ ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. "వారు నన్ను చాలాసార్లు కొట్టారు. నా కాళ్ళపై కొట్టారు. మావోయిస్టులు లేదా ఇస్లామిక్ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఒప్పుకునేలా నన్ను బలవంతం చేశారు. వారు ఎన్ని హింసలు పెట్టినా నేను వారు చెప్పింది ఒప్పుకోలేదు"అని కప్పన్ చెప్పారు.

“వారు నన్ను హింసించడమే కాకుండా, కస్టడీలో అసంబద్ధమైన ప్రశ్నలు కూడా అడిగారు. నేనెప్పుడైనా పాకిస్థాన్‌కు వెళ్లానా లేక గొడ్డు మాంసం తిన్నానా అని వారు ప్రశ్నించారు.

జైలు శిక్ష సమయంలో కప్పన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఏప్రిల్ 12, 2021 న, అతను జైలులో అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతనికి మధుమేహం ఉంది. దాంతో పాటు COVID పాజిటివ్ వచ్చింది. తరువాత, కప్పన్‌ను మథుర వైద్య కళాశాలలో చేర్చారు, అక్కడ అతన్ని సంకెళ్ళతో బంధించారు.. ఏడు రోజుల పాటు తనను వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని, మూత్ర విసర్జనకు ప్లాస్టిక్ బాటిల్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని కప్పన్ తెలిపారు.

కోర్టు ఆదేశంతో, అతన్ని ఏప్రిల్ 28, 2021న ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు మార్చారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, డిసెంబర్ 2021లో మధుర జైలు నుండి లక్నో జైలుకు తరలించారు.

లక్నోలో కూడా తనకు సరైన వైద్యం అందలేదని కప్పన్ చెప్పాడు.తనకే కాదు లక్నో జైలులో ఉన్న వైద్యులు ఏ రోగులకు కూడా సరిగా చికిత్స చేయరు అని కప్ప‌న్ అన్నారు.

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, కప్పన్ భారతదేశంలో జర్నలిజం ప్రమాదంలో ఉంది అని చెప్పాడు. దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ఇతర జర్నలిస్టుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై తీవ్రవాద ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం వారి నోరు మూయిస్తున్నదని ఆరోపించారు.

తన ప్రణాళికల గురించి మాట్లాడుతూ, తాను జర్నలిస్టుగా కొనసాగుతానని కప్పన్ చెప్పారు. తాను 2013 నుండి ఢిల్లీలో ఉన్నానని, కేరళకు చెందిన మలయాళ వార్తా పోర్టల్ కోసం పార్లమెంటు, కాంగ్రెస్, మైనారిటీల వంటి బీట్‌లను కవర్ చేశానని అతను చెప్పాడు.

తనను నిర్బంధించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) వంటి "కఠినమైన చట్టాలకు" వ్యతిరేకంగా పోరాడతానని కూడా కప్పన్ చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News