మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. కారణం ఏంటంటే..?

బంద్ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయిబాబా సంస్థాన్‌ లో భక్తులు బస చేయొచ్చని, ప్రసాదాలయం, క్యాంటీన్‌ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-04-28 08:58 IST

మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. కారణం ఏంటంటే..?

మీరు సాయిబాబా భక్తులా, తరచూ షిర్డీ వెళ్తుంటారా, మే 1 తర్వాత షిర్డీకి ప్లాన్ చేసుకున్నారా..? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మే -1నుంచి షిర్డీలో నిరవధిక బంద్ కొనసాగుతుంది. సాయిబాబా ఆలయానికి, సాయి దర్శనాలకు ఇబ్బందేమీ ఉండదు కానీ, స్థానికంగా ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవని తేలిపోయింది. స్థానికులే స్వచ్ఛందంగా షిర్డీలో బంద్ పాటిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. షిర్డీ ఆలయానికి ప్రతిపాదించిన CISF భద్రతను వారు వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం షిర్డీ సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్‌ ట్రస్ట్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇతర భద్రత వ్యవహారాలు మహారాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో ఉంటాయి. షిర్డీ ఆలయాన్ని ప్రతి రోజూ బాంబు స్క్వాడ్‌ తనిఖీ చేస్తుంది. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి ఇస్తారు. అయితే రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో, షిర్డీపై దాడులు జరిగే అవకాశముందని, సామాజిక కార్యకర్త సంజయ్‌ కాలే 2018లో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్ట్ సాయి సంస్థాన్ ట్రస్ట్ అభిప్రాయం కోరింది. CISF భద్రతకు సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం అనుమతితో త్వరలోనే షిర్డీలో CISF భద్రత ఏర్పాటు చేస్తారని తేలిపోయింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు కోర్టుని ఆశ్రయించారు. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మే 1నుంచి నిరవధిక బంద్ పాటిస్తామన్నారు.

CISF ఎందుకు వద్దు..?

ఇప్పటి వరకూ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. CISF ఎంట్రీ ఇస్తే ఇక ఆ సిబ్బందికి అక్కడ పని ఉండదు. స్థానికులకు కూడా ఇబ్బంది ఎదురవుతుందని, ఆలయంతో మాట చెల్లుబాటు కాకుండా పోతుందనేది వారి అనుమానం. అందుకే వారు CISF ని వద్దంటున్నారు. దీనితోపాటు మరిన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందుంచారు.


సాయిబాబా సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టును రద్దు చేయాలని, వారి స్థానంలో ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహశీల్దార్‌, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, ఆ బోర్డ్ లో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలని అంటున్నారు.

బంద్ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయిబాబా సంస్థాన్‌ లో భక్తులు బస చేయొచ్చని, ప్రసాదాలయం, క్యాంటీన్‌ కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్థానికుల ప్రమేయం ఉండే ఇతర అన్ని వ్యాపారాలు పూర్తిగా మూసివేస్తారు. ప్రైవేటు రవాణా కూడా అంతంత మాత్రమేనని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News