షిండే గ్రూప్ లో ముసలం..! శివసేన మళ్లీ ఒకటవుతుందా..?

బీజేపీ విదిల్చే సీట్లను తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో లేకుండా ఏక్ నాథ్ షిండే వర్గం సాధించేదేమీ లేదు. పైగా ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఎన్సీపీతో ప్రతిపక్ష కూటమి ఇంకా బలంగానే ఉంది.

Advertisement
Update:2023-06-01 07:11 IST

మహారాష్ట్రలో సీఎం సీటు ఆశించి భంగపడిన ఏక్ నాథ్ షిండే.. శివసేన నుంచి వేరు కుంపటి పెట్టారు, తనతోపాటు 40మంది ఎమ్మెల్యేలను చీల్చి తన కల నెరవేర్చుకున్నారు. మరి అలాంటి షిండేలు ఆయన గ్రూప్ లో కూడా ఉంటారు కదా..? వారు కూడా ఏదో ఆశించి భంగపడి అసంతృప్తితో రగిలిపోతుంటారు కదా..? సరిగ్గా అలాంటి అసంతృప్తి షిండేలను ఉద్ధవ్ సేన దగ్గరకు తీయాలని చూస్తోంది. ఇప్పటికే షిండే గ్రూప్ లోని 22మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు తమతో టచ్ లోకి వచ్చారని చెబుతోంది. సామ్నా పత్రికలో ధైర్యంగా ఈ విషయాలను బయటపెట్టింది.

ఉద్ధవ్ వర్గం బ్లాక్ మెయిల్ చేయడానికో లేదా రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఈ కామెంట్ చేసిందని అనుకోలేం. వాస్తవానికి బీజేపీతో కలసి చేస్తున్న సంసారం విషయంలో షిండే కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పేరుకి సీఎం షిండే అయినా, పెత్తనం మాత్రం బీజేపీ అధిష్టానానిది, వ్యవహారాలు చక్కబెట్టేది షాడో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ విషయం షిండే గ్రూప్ అంతటికీ తెలుసు. కానీ ఆ కుర్చీపై ప్రేమతో అన్నిటికీ సిద్ధపడ్డారు ఏక్ నాథ్. చివరికి ఆయన కూడా ఏకాకిగా మారిపోయే ప్రమాదముంది.

శివసేన రెండు వర్గాలుగా విడిపోయి, ఎన్నికల కమిషన్ వద్ద పంచాయితీ తేల్చుకున్నా.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల విషయంలో రెండు వర్గాలను భయం వెంటాడుతోంది. బీజేపీ విదిల్చే సీట్లను తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో లేకుండా ఏక్ నాథ్ షిండే వర్గం సాధించేదేమీ లేదు. పైగా ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఎన్సీపీతో ప్రతిపక్ష కూటమి ఇంకా బలంగానే ఉంది. కొత్తగా బీఆర్ఎస్ తో కూడా పోటీ మొదలవుతోంది. మధ్యలో ఎన్సీపీ చీలికవర్గంతో బీజేపీ ఆడాలనుకుంటున్న డబుల్ గేమ్ కూడా షిండే వర్గానికి తెలుసు. ఈ దశలో ఏమాత్రం పట్టు సడలినా ఉద్ధవ్ వైపు వచ్చేయడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి శివసేన మళ్లీ ఏకమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే నిజమైతే కర్నాటకలో బీజేపీ కుట్ర రాజకీయాలకు ముగింపు పలికిన ఓటర్లు, మహారాష్ట్రలో కూడా అదే చైతన్యాన్ని కనబరిస్తే కమలం వాడిపోవడం ఖాయం. సార్వత్రిక ఎన్నికలనాటికి బీజేపీ ప్రభ తగ్గిపోతే ఆ వ్యతిరేకతను తనపై వేసుకోడానికి షిండే సేన ఇష్టపడకపోవచ్చు. అప్పుడు వారికి ఉన్న ఏకైక దారి శివసేనను ఏకం చేయడమే. 

Tags:    
Advertisement

Similar News