అది ఖర్గేతో అయ్యే పని కాదు.. థరూర్ కీలక వ్యాఖ్యలు..

రోజురోజుకీ ఆయన మాటలు పదునుతేలుతున్నాయి. పార్టీలో మార్పు అనేది ఖర్గేతో వీలయ్యే వ్యవహారం కాదని తాజాగా తేల్చేశారు థరూర్.

Advertisement
Update:2022-10-03 07:25 IST

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఫ్రెండ్లీ గేమ్ కాదని, సీరియస్ గేమ్ అని స్పష్టమవుతోంది. బరిలో ఉన్నది ఇద్దరే అయినా రోజు రోజుకీ మాటల్లో పదును మారుతోంది. అధిష్టానం తమ మనిషిగా మల్లికార్జున్ ఖర్జేని బరిలో దింపింది, ఆయన్ను కాదని శశిథరూర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ పరిరక్షణకు తాను పోటీలో ఉన్నానని చెబుతున్న థరూర్ మొదట్లో ఇది ఫ్రెండ్లీ ఫైట్ అన్నారు, కానీ రోజురోజుకీ ఆయన మాటలు పదునుతేలుతున్నాయి. పార్టీలో మార్పు అనేది ఖర్గేతో వీలయ్యే వ్యవహారం కాదని తాజాగా తేల్చేశారు థరూర్.

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ టాప్ 3 లీడర్లలో ఒకరని, ఆయనలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురాలేరని, ఇప్పుడున్న వ్యవస్థనే కొనసాగిస్తారని అన్నారు శశిథరూర్. తమ ఇద్దరి మధ్య యుద్ధం జరగడంలేదని, తాము శత్రువులం కాదని అంటూనే.. ఖర్గే అధిష్టానం విధేయుడంటూ సునిశితంగా విమర్శిస్తున్నారు థరూర్. ఆయనతో మార్పు సాధ్యం కాదని తేల్చేశారు.

పోటీ తప్పదా..?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలనుంచి తాను తప్పుకునేది లేదని తేల్చేశారు శశిథరూర్. పోనీ పోటీకి ముందయినా ఆయన సైలెంట్ అవుతారనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా కనిపించడంలేదు. గట్టిపోటీ ఇచ్చేట్టుగా ఉన్నారు. ఖర్గేకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ థరూర్ ని గెలిపిస్తే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి అని కొంతమంది కాంగ్రెస్ నేతల్లో ఆలోచన మొదలైనట్టు తెలుస్తోంది. అయితే చివరకు అందరూ అధిష్టానం కోరిక మేరకు ఖర్గేకి అఖండ మెజార్టీ చేకూర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం చెప్పిందే జరుగుతుంది, వారిని కాదని ఇప్పుడు థరూర్ గెలిచినా సమన్వయలోపం ఉంటే అది పార్టీకే నష్టమని మెజార్టీ వర్గం బావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇక ఖర్గేకు ఇప్పటికే 30మంది సీనియర్ నేతలు మద్దతు తెలుపగా ఇందులో జి-23 నేతలు కూడా ఉండటం విశేషం. థరూర్ వర్గం ఎవరనేది ఇంకా బయటపడలేదు. ఈనెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి, 19న ఫలితాలు వెలువడతాయి.

Tags:    
Advertisement

Similar News