బీజేపీ వ్యతిరేక కూటమి కోసం మరో ముందడుగు..
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని థర్డ్ ఫ్రంట్ ఆలోచనలకు మళ్లీ జీవం పోశారు శరద్ పవార్. 2024 సార్వత్రిక ఎన్నికలనాటికి వైరి వర్గాలన్నీ ఒక్కటవుతాయని, కాంగ్రెస్ తోనే కలసి నడుస్తాయని అంటున్నారు శరద్ పవార్.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేది ఎవరు..? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని థర్డ్ ఫ్రంటా..? కాంగ్రెసేతర పార్టీల కలయికలో ఏర్పడే ఫోర్త్ ఫ్రంటా..? ఇక్కడే ఈ చర్చ ఆగిపోయింది. ఇటీవల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలవడానికి విపక్షాలు సుముఖంగా లేకపోవడం.. అసలు కాంగ్రెస్ తో కలసి చర్చల్లో కూర్చోడానికి కూడా కొన్ని పార్టీలు విముఖత చూపడంతో.. హస్తం పార్టీ సారథ్యం అనే వ్యవహారంపై అనుమానాలు చెలరేగాయి. కాంగ్రెస్ కూడా ఓ ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని, నాయకుడు లేక సతమతం అవుతోందనే విమర్శలు వినిపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని థర్డ్ ఫ్రంట్ ఆలోచనలకు మళ్లీ జీవం పోశారు శరద్ పవార్.
మహారాష్ట్రలో శరద్ పవార్ కాంగ్రెస్ తో కలసి మహా ఘట్ బంధన్ లో ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని వైరి వర్గంగా చూసే పార్టీలున్నాయి. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలనాటికి ఆ వైరి వర్గాలన్నీ ఒక్కటవుతాయని, కాంగ్రెస్ తోనే కలసి నడుస్తాయని అంటున్నారు శరద్ పవార్. బీజేపీ వ్యతిరేక కూటమికోసం కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు మమతా బెనర్జీ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ తో ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారని తెలిపారు శరద్ పవార్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆమాత్రం సీట్లు రావడానికి కారణం.. కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని కూటమి అని బలంగా నమ్ముతున్నారు మమత. అయితే అవేవీ ఇప్పుడామె పట్టించుకోవడంలేదని, కేవలం బీజేపీని ఓడించడం ఒక్కటే కర్తవ్యంగా పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ తో కలసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని శరద్ పవార్ చెబుతున్నారు.
కాంగ్రెస్ తో ఆ పేచీ లేదు..
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి ఏర్పాటు చేయబోయే కూటమిలో చేరేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో పేచీ కూడా ఉండదని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. గతంలో యూపీఏలో కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నా కూడా సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, కనీసం పార్టీ అధ్యక్ష పదవి కూడా వద్దంటున్నారు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తే, అప్పుడెలాగూ ఆ పార్టీ చెప్పినట్టే వినాలి. ప్రధాని పోస్ట్ విషయంలో పెద్దగా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి ఉండదు కాబట్టి.. ఆ జట్టులో చేరడానికి అందరూ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.