ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామా..
వచ్చే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం సంచలనం అనే చెప్పాలి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్సీపీ అధినేత పదవినుంచి వైదొలగుతున్నానని ఆయన ప్రకటించగానే పార్టీ శ్రేణులు షాకయ్యాయి. ఇంత సడన్ గా ఆయన ఈ నిర్ణయం ప్రకటించడానికి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియడంలేదు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.
వచ్చే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం సంచలనం అనే చెప్పాలి. మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ వర్గం ఉన్నాయి. ఇటీవల శివసేన చీలిక వర్గం బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ప్రతిపక్ష కూటమి మాత్రం కలసికట్టుగానే ఉంది. ఎన్సీపీ అంతర్గత రాజకీయాలు కూటమిపై కూడా ప్రభావం చూపించే అవకాశముంది.
అదే నిజమవుతుందా..?
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన చీలిక వర్గం కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనసాగుతోంది. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలసిపోతుందని, అప్పుడు షిండే సీఎం సీటుకి ఎసరు వస్తుందని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని అజిత్ పపవార్ ఖండించినా పుకార్లు మాత్రం ఆగలేదు. ఈలోగా బీజేపీ స్నేహితుడైన గౌతమ్ అదానీ, శరద్ పవార్ భేటీ ఆసక్తికరంగా మారింది. అదానీకి మద్దతుగా శరద్ పవార్ మాట్లాడటం కూడా కాంగ్రెస్ కి రుచించలేదు. ప్రస్తుతం శరద్ పవార్ రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఏంటనేది తేలాల్సి ఉంది. పార్టీ పగ్గాలు అజిత్ పవార్ కి అప్పగిస్తారా, అదే జరిగితే ఆయన బీజేపీతో చెలిమికి సై అంటారా అనే విషయంపై ముందు ముందు క్లారిటీ వస్తుంది.