సంచలన నిర్ణయం వెల్లడించిన శరద్ పవార్.. - రాజీనామా పైనా క్లారిటీ
తన అంచనా తప్పిందని ఆయన చెప్పారు. తమ పార్టీ అగ్ర నాయకత్వం అంతా తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని సూచించారని చెప్పారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఇటీవల తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నిర్ణయంపై పార్టీ శ్రేణులు తమ వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఆయన రాజీనామాను తిరస్కరించడం తెలిసిందే. పార్టీ అధినేతగా ఆయనే కొనసాగాలని శ్రేణులు బతిమాలిన ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాను కూడా వెనక్కి తీసుకున్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిణామాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనని శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్టీ బాధ్యతలను కొత్త తరానికి అప్పగించడం కోసం తాను నెలరోజుల నుంచి రాజీనామా ఆలోచన చేస్తూ వచ్చినట్టు ఆయన వివరించారు.
తన రాజీనామా నిర్ణయాన్ని ముందే చెబితే పార్టీ శ్రేణులు అంగీకరించవని భావించి.. నేరుగా రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత తన పార్టీ శ్రేణులను ఒప్పించవచ్చని భావించానని తెలిపారు. అయితే తన అంచనా తప్పిందని ఆయన చెప్పారు. తమ పార్టీ అగ్ర నాయకత్వం అంతా తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని సూచించారని చెప్పారు. తన మేనల్లుడు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన రాజీనామా ఉపసంహరణ విషయంలో కీలక భూమిక పోషించాడని ఆయన తెలిపారు. సోనియా గాంధీ సైతం ఫోన్ చేసి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారని పవార్ చెప్పారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం తాను పనిచేస్తానని, కానీ పోటీ చేయనని పవార్ స్పష్టం చేశారు. పోటీచేసిన వారి విజయం కోసం తాను కృషిచేస్తానని చెప్పారు. తన వారసుడు ఎవరనే విషయం నిర్ణయించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని పవార్ చెప్పారు. సుప్రియ సూలే, ప్రఫుల్ పటేల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. వారసుడి ఎంపికకు ఇంకా మూడేళ్ల సమయం తమ చేతిలో ఉందని ఆయన తెలిపారు. జిల్లాల్లో పనిచేస్తున్న పార్టీ నాయకులను రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారిని జాతీయ రాజకీయాల్లో పాల్గొనేలా సంసిద్ధం చేస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.