పనిమనిషికి నరకం చూపిన బీజేపీ నేత అరెస్ట్
పనిమనిషిని చిత్రహింసలపాల్జేసిన జార్ఖండ్ కు చెందిన బీజేపీ నాయకురాలు సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఈమె చేతిలో హింసలకు గురైన పనిమనిషి సునీత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తమ ఇంట్లో పని చేస్తున్న మహిళను టార్చర్ పెట్టి.. ఆమెకు నరకం చూపిన బీజేపీ నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతామని వారు తెలిపారు. తమ పనిమనిషి పట్ల ఈమె క్రూరంగా ప్రవర్తించినట్టు సమాచారం తెలియగానే పార్టీ నుంచి సీమా పాత్రను సస్పెండ్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా అయిన ఆమె ఏ మాత్రం క్షంతవ్యురాలు కాదని, పనిమనిషి సునీతకు ఆమె క్షమాపణ చెప్పాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. సీమా పాత్ర అమానుషాన్ని బీజేపీలో నేతలంతా ఖండించాలని ప్రియాంక ట్వీట్ చేశారు. ఆదివాసీ మహిళ అయిన సునీత నోటి పళ్ళు ఊడిపోయి.. రాంచీ ఆసుపత్రిలో లేవలేని స్థితిలో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఒంటిమీద వాతలు, గాయాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఝార్ఖండ్ లోని గుమ్లా జిల్లాకు చెందిన 29 ఏళ్ళ సునీత సుమారు 10 ఏళ్లుగా సీమా పాత్ర ఇంట్లో పని చేస్తోంది. అయితే ఆరేళ్లుగా తన యజమానురాలు తనను ఇంట్లోనే నిర్బంధించిందని, వేడి రాడ్లతో తన ఒంటిమీద వాతలు పెట్టేదని, ఇష్టమొచ్చినట్టు బెల్టుతో కొట్టేదని ఆమె వాపోయింది. సీమా పాత్ర దాడిలో తన నోటి పళ్ళు ఊడిపోయాయని ఆమె బావురుమంది. సీమా కొడుకు ఆయుష్మాన్ పాత్ర మిత్రుడికీ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు వివిధ సెక్షన్ల కింద సీమా పాత్రపై కేసు నమోదు చేశారు. ఈమె అమానుషంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా స్పందించి.. ఈమెపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిన పక్షంలో వెంటనే అరెస్టు చేయాలని ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ ఉదంతపై సమగ్ర దర్యాప్తు జరగాలని సూచించారు.