అనిల్‌ అంబానీపై సెబీ నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా

ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్‌ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్‌ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆరు నెలలపాటు నిషేధించింది.

Advertisement
Update:2024-08-23 13:34 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. సెక్యూరిటీస్‌ మార్కెట్ల నుంచి ఆయన్ని ఐదేళ్ల పాటు నిషేధిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ‘రిలయన్స్‌ హోమ్‌ఫైనాన్స్‌’లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకు కూడా ఈ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.

అంతేకాదు.. అనిల్‌ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా కూడా సెబీ విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవ‌ద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్‌ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్‌ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆరు నెలలపాటు నిషేధించింది. దానిపై రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది.

అనిల్‌ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. సంస్థ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాటిని యాజమాన్యం బేఖాతరు చేసిందని తెలిపింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయని వివరించింది. ఫలితంగా ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా తీసి ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సివచ్చిందని పేర్కొంది. తద్వారా పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది. ఉదాహరణకు 2018లో కంపెనీ షేరు ధర రూ. 59.60 వద్ద ఉందని తెలిపింది. 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావడం, నిధులు అడుగంటిపోవటంలో షేరు విలువ రూ.0.75కు పడిపోయినట్లు గుర్తుచేసింది. ఇప్పటికీ తొమ్మిది లక్షల మంది వాటాదారులు నష్టాలతో కొనసాగుతున్నారని వివరించింది. అనిల్‌ అంబానీతో పాటు మరికొందరు కీలక అధికారులపైనా సెబీ భారీ జరిమానా విధించింది. మరికొన్ని సంస్థలపై రూ.25 కోట్ల అపరాధ రుసుము చెల్లింపునకు ఆదేశించింది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించింది.

Tags:    
Advertisement

Similar News