నేనూ డీప్‌ ఫేక్‌ బాధితురాలినే.. - సారా టెండూల్కర్‌

మన రోజువారీ కార్యకలాపాలు, ఆనందాలు, బాధలను పంచుకునేందుకు సోషల్‌ మీడియా అద్భుతమైన వేదికని, కానీ.. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కలవరపెడుతోందని సారా టెండూల్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-11-22 18:39 IST

ఇటీవల సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి డీప్‌ ఫేక్‌ వీడియోలు సృష్టిస్తూ వాటిని వైరల్‌ చేస్తున్న విషయం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ కూడా ఈ డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఎక్స్‌ (ట్విట్ట‌ర్‌)లో తన పేరుతో కొంతమంది నకిలీ ఖాతాలు తెరిచారని ఆమె తెలిపారు.

టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా టెండూల్కర్ క్లోజ్‌గా ఉన్నట్టు ఇటీవల ఓ మార్ఫింగ్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ టెండూల్కర్‌తో ఉన్న ఫొటోను కొందరు ఆకతాయిలు డీప్‌ ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి వైరల్‌ చేశారు. గతంలో శుభ్‌మన్‌ గిల్, సారా టెండూల్కర్‌ డేటింగ్‌లో ఉన్నారని వదంతులు వచ్చాయి. దీంతో తాజాగా డీప్‌ ఫేక్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే సారా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టారు.

మన రోజువారీ కార్యకలాపాలు, ఆనందాలు, బాధలను పంచుకునేందుకు సోషల్‌ మీడియా అద్భుతమైన వేదికని, కానీ.. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కలవరపెడుతోందని సారా టెండూల్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో తన డీప్‌ ఫేక్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవడం చూశానని తెలిపారు. ’ఎక్స్‌ (ట్విట్ట‌ర్‌)’లో కొందరు ఉద్దేశపూర్వకంగా తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు.

అసలు విషయమేంటంటే.. తనకు ’ఎక్స్‌’లో అసలు ఖాతానే లేదని ఆమె పేర్కొన్నారు. అలాంటి నకిలీ ఖాతాలను ’ఎక్స్‌’ గుర్తించి, వాటిని సస్పెండ్‌ చేస్తుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా సారా టెండూల్కర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వాస్తవాలను ఫ‌ణంగా పెట్టి వినోదం పంచకూడదని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వసనీయత, వాస్తవికత ఉండే కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. డీప్ ఫేక్‌పై చర్యలు చేపట్టేందుకు కేంద్రం కూడా సిద్ధమైంది. దీనిపై చర్చించేందుకు సోషల్‌ మీడియా సంస్థలతో భేటీ కానున్నట్టు ప్రకటించింది. అవసరమైతే డీప్‌ ఫేక్‌పై కొత్త చట్టం తీసుకొస్తామని కూడా కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News