మోడీ 3.0.. ప్రమాణస్వీకారానికి పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు
మోడీ ప్రమాణ స్వీకారానికి పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు చేసిన కూలీలు, వందే భారత్ ప్రాజెక్టులో పాలుపంచుకున్న కార్మికుల్లో కొందరిని ఆహ్వానిస్తున్నారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. మెజారిటీ తగ్గినా నితీష్‌కుమార్, చంద్రబాబు లాంటి సీనియర్ భాగస్వాములు మోడీకి ఏకగ్రీవంగా మద్దతు పలకడంతో మోడీ 3.0కు లైన్ క్లియర్ అయింది. ఈనెల 9న ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి దేశవిదేశీ ప్రముఖులతోపాటు కొందరు సామాన్యులను కూడా ఆహ్వానిస్తున్నారు.
పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు ఆహ్వానం
మోడీ ప్రమాణ స్వీకారానికి పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు చేసిన కూలీలు, వందే భారత్ ప్రాజెక్టులో పాలుపంచుకున్న కార్మికుల్లో కొందరిని ఆహ్వానిస్తున్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న అట్టడుగు స్థాయి శ్రామికులకు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవ సంబరంలో అవకాశం కల్పించాలని మోడీ నిర్ణయించారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి.
వీవీఐపీల సంస్కృతిని మార్చే ప్రయత్నం
మోడీ అధికారంలోకి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా సామాన్యులకు తన పక్కన కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. వీవీఐపీ సంస్కృతిని పారద్రోలాలన్నదే తమ లక్ష్యమని చెప్పకనే చెబుతున్నారు. ఉన్నత వర్గాలకు, కవులు, సాహితీవేత్తలు, సినీతారలు, క్రీడాకారులకే పరిమితమైన పద్మ పురస్కారాలను కూడా మారుమూల కుగ్రామాల్లో సేవలు చేస్తున్నవారికి, ప్రకృతి ప్రేమికులకు, ప్రపంచం ఎరుగని పర్యావరణ వేత్తలకు ఇలా చాలామందికి ఈ పదేళ్లలో పద్మ పురస్కారాలు అందించి, తమ ప్రభుత్వ ప్రత్యేకత ఇది అని చాటారు.