తమిళనాట తెలుగు సినిమాల్ని అడ్డుకుంటాం..
తమిళనాట తెలుగు సినిమాలేవీ ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పండగ కలెక్షన్లు కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కావాలనుకుంటున్న తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు సినిమా నిర్మాతల మండలి తీసుకున్న ఓ నిర్ణయాన్ని తమిళనాడు రాజకీయ పార్టీ తప్పు పట్టింది. సామ్ తమిళర్ అనే పార్టీ సమన్వయకర్త సీమాన్.. తెలుగు సినిమా నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేశారు. పండగల సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల విడుదలకు అడ్డంకులు సృష్టిస్తే, అసలు తమిళనాట తెలుగు సినిమాలేవీ ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారాయన. పండగ కలెక్షన్లు కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కావాలనుకుంటున్న తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలే కరోనా కష్టాలు, ఆపై ఓటీటీలు, ఇక సినిమాకి అదిరిపోయే టాక్ వస్తేకానీ థియేటర్లకు రాని జనాలు.. ఇలా ఉంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఈ దశలో మనం పాన్ ఇండియా అంటూ ఎగిరి గంతేస్తున్నాం కానీ, పక్క రాష్ట్రాలనుంచి కాంతార వంటి సినిమాలు వచ్చి కలెక్షన్లు కొల్లగొట్టుకు పోతే మాత్రం నోరెళ్లబెట్టి చూస్తూ ఉండాల్సిందే. అయితే పండగ కలెక్షన్లపై మన హీరోలు, నిర్మాతలకు మక్కువ ఎక్కువ. కనీసం పండగల వేళ అయినా పొరుగు రాష్ట్రం సినిమాలకు అవకాశం ఇవ్వొద్దంటూ ఇటీవల నిర్మాతల మండలి ఓ తీర్మానం చేసింది. పండగ సీజన్లో థియేటర్ల తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే ఇవ్వాలని, ఆ తర్వాత డబ్బింగ్ మూవీస్ కి థియేటర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంక్రాంతి నుంచే దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు.
గతంలో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ ప్రపోజల్ పెట్టినా, ఇప్పుడు ఆయనకే ఈ నిర్ణయం ఇబ్బందిగామారే పరిస్థితి కనపడుతోంది. తమిళ్ హీరో విజయ్ తో ఆయన వారసుడు అనే సినిమా తీస్తున్నాడు. దీన్ని ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చేస్తామన్నారు. అయితే ఆమధ్య తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ లు ఆపేసినప్పుడు, మాది తమిళ్ సినిమా అంటూ దిల్ రాజు షూటింగ్ కొనసాగించాడు. దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. సరిగ్గా ఇప్పుడు నిర్మాతల మండలి కూడా ఇదే పాయింట్ రైజ్ చేస్తూ వారసుడు సినిమాకి థియేటర్లు దొరక్కుండా చేయాలనుకుంటోంది. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి పోటీపడుతున్నాయి. వీటి మధ్య మరికొన్ని తెలుగు స్ట్రైట్ సినిమాలు వస్తున్నాయి. అసలే తెలుగు ఇండస్ట్రీ హిట్లు లేక, కలెక్షన్లు లేక సతమతం అవుతోందని, ఈ దశలో కనీసం పండగలకయినా పొరుగు రాష్ట్రం సినిమాలను దూరంగా పెట్టాలంటున్నారు నిర్మాతలు. ఇది ఒకరకంగా దిల్ రాజు వారసుడు సినిమాని ఇబ్బంది పెట్టే నిర్ణయమే. కానీ అనుకోకుండా ఇప్పుడు తమిళ పార్టీలు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చడం ఇబ్బందిగా మారింది.
సామ్ తమిళర్ అనే పార్టీ ఎక్కడుంది, దాని వెనకున్నది ఎవరు, వారి బలమెంత అనే విషయం ఇక్కడ చర్చనీయాంశం కాదు. తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలను అడ్డుకుంటున్నారు, తమిళనాడులో కూడా తెలుగు సినిమాలను అడ్డుకోవాలి అన్నదే ఇక్కడ పాయింట్. దీంతో తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతోంది. పండగ కలెక్షన్లు కేవలం మాకే కావాలి, మిగతా రోజుల్లో మీ ఇష్టం అంటే పాన్ ఇండియా అర్థమే మారిపోతుంది. సత్తా ఉన్న సినిమానే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది, సత్తా లేకుండా వందలాది థియేటర్లలో విడుదల చేసి ప్రేక్షకుల మీద రుద్దడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. ఈ గొడవతో తెలుగు నిర్మాతల మండలి తమ నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.