తల్లి కడుపులో ఉండగానే శిశువులకు సంస్కృతి, విలువలను నేర్పించాలని డాక్టర్లను కోరిన ఆరెస్సెస్ మహిళా విభాగం
''గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో పాటు, సంవర్ధినీ న్యాస్ సభ్యులు గర్భధారణ సమయంలో గీతా పఠనం, రామాయణం, యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాన్నిఅమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.'' అని సంవర్ధినీ న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే సోమవారం తెలిపారు
పిల్లలు పుట్టక ముందే వారికి భారత దేశ సంస్కృతి, విలువలు నేర్పించాలని ఆరెస్సెస్ మహిళా విభాగం 'రాష్ట్ర సేవికా సమితి'కి చెందిన 'సంవర్ధినీ న్యాస్' నిర్ణయించింది. దీని కోసం 'గర్భ సంస్కార్' పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించబోతున్నది. తల్లి గర్భంలో ఉండగానే శిశువులకు గీతా పఠనం, రామాయణం వినిపించాలని 'సంవర్ధినీ న్యాస్' డాక్టర్లను కోరింది.
''గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో పాటు, సంవర్ధినీ న్యాస్ సభ్యులు గర్భధారణ సమయంలో గీతా పఠనం, రామాయణం, యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాన్నిఅమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.'' అని సంవర్ధినీ న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే సోమవారం తెలిపారు
ఈ కార్యక్రమం మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువులకు రెండేళ్ళు వచ్చే వరకు కొనసాగుతుంది.
గర్భ సంస్కారం గురించి ఋగ్వేదంలో ప్రస్తావించారని , గర్భధారణ సమయంలో సంతోషంగా ఉండటం, సానుకూల ఆలోచనలు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, తాజా సాత్విక ఆహారాన్ని తినడం, క్రమం తప్పకుండా యోగా చేయడం, తల్లి కడుపులో పెరుగుతున్న పిల్లలతో మాట్లాడటం వంటి పనులు చేయాలని ఋగ్వేదం చెప్పిందని మాధురీ మరాఠే అన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా సంవర్ధినీ న్యాస్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇందులో ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరయ్యారు.
గైనకాలజిస్టులు గర్భిణీ స్త్రీలకు చేరువ కావాలని, పిల్లలు పుట్టకముందే భారతీయ సంస్కృతి గురించి తెలుసుకునేలా చేయాలని వర్క్‌షాప్ సూచించింది.
బలమైన, శక్తివంతమైన దేశాన్ని నిర్మించడానికి గర్భ సంస్కారం అవసరమని వర్క్ షాప్ ప్రకటించింది..
ప్రతి సంవత్సరం కనీసం 1,000 మంది గర్భిణీ తల్లులలో గర్భ సంస్కారాన్ని ప్రోత్సహిస్తామని వర్క్‌షాప్ లో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు.