అదానీకి ఆర్ఎస్ఎస్ వత్తాసు.. ఆర్గనైజర్ లో కవరింగ్ కథనాలు
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదికను ఉద్దేశపూర్వక దాడిగా ఆర్ఎస్ఎస్ అభివర్ణించింది. సంఘ్ అధికారిక వెబ్ సైట్ ఆర్గనైజర్ లో అదానీకి మద్దతుగా ఓ కథనం కూడా రాసుకొచ్చింది.
అదానీ గ్రూప్ కి ఆర్ఎస్ఎస్ వత్తాసు పలుకుతోంది. తన గ్రూపుపై జరిగిన దాడి, యావత్ భారత దేశంపై జరిగిన దాడి అంటూ అదానీ ఇది వరకే ఓ వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు దానికి మద్దతుగా ఆర్ఎస్ఎస్ మాట్లాడటం విచిత్రం. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదికను ఉద్దేశపూర్వక దాడిగా ఆర్ఎస్ఎస్ అభివర్ణించింది. సంఘ్ అధికారిక వెబ్ సైట్ ఆర్గనైజర్ లో అదానీకి మద్దతుగా ఓ కథనం కూడా రాసుకొచ్చింది.
వామపక్ష భావజాలం..
హిండెన్ బర్గ్ రీసెర్చి సంస్థ ఇచ్చిన నివేదికను భారతీయుల్లోని ఓ వర్గం విపరీతంగా ప్రచారం చేస్తోందని, అదానీకి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారం మొదలు పెట్టారని ఆర్గనైజర్ లో ఆర్ఎస్ఎస్ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యతిరేక ప్రచారంలో వామపక్ష భావజాలంతో సంబంధం ఉన్న కొన్ని వెబ్ సైట్లు, కొందరు వ్యక్తులు ఉన్నారని ఆరోపించింది. ఈ దాడి జనవరి 25న ప్రారంభం కాలేదని.. దీనికి 2016-17లో ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని ఆరోపించింది.
ఆస్ట్రేలియాలో ఎందుకంటే..?
ఆస్ట్రేలియాలో అదానీకి బొగ్గు గనులు ఉన్నాయి. అక్కడినుంచి భారత్ కు అదానీ బొగ్గుని సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ అనే పర్యావరణ అనుకూల ఎన్జీఓ అదానీ గ్రూప్ పై పగబట్టిందని, అదానీని దెబ్బతీసేందుకు ఉద్దేపూర్వకంగా వెబ్ సైట్స్ లో కథనాలు ప్రచురిస్తోందని ఆర్గనైజర్ ఆరోపించింది. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనుల ప్రాజెక్టుపై వ్యతిరేకతతో ప్రారంభమైన వెబ్ సైట్.. అదానీకి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా కథనాలు ఇస్తుందని పేర్కొంది. అదానీ సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే సదరు సంస్థ లక్ష్యమని ఆర్గనైజర్ లో ఆర్ఎస్ఎస్ ఆరోపించింది.
మరోవైపు అదానీ గ్రూపు షేర్లన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో ఎఫ్.పి.ఎ. ను సైతం అదానీ ఎంటర్ ప్రైజెస్ ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడికింది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా ఉంది. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగించి అదానీకి వత్తాసు పలుకుతోంది.