బెంగుళూరులో పది నిమిషాల వర్షానికే మునిగిపోయిన రోడ్లు.... ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

పది నిమిషాల వర్షానికే బెంగుళూరు అస్తవ్యస్తమైపోయింది. గంటల‌ కొద్దీ ట్రాఫిక్ జాం అయ్యింది. మురుగు నీరు వ్యవస్థ, రోడ్ల ను పట్టించుకోని ప్రభుత్వంపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు.

Advertisement
Update:2022-09-05 13:24 IST

బెంగుళూరులో ఈ రోజు ఉదయం కురిసిన వర్షానికి నగరంలో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. పది నిమిషాల వర్షానికి బెంగుళూరు రోడ్లన్నీ నిండిపోయాయి. కొన్ని వాహనాలు మునిగిపోయాయి. అనేక చోట్ల గంటల‌పాటు ట్రాఫిక్ జాంలతో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. బెళ్లందురు, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, BEML లేఅవుట్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలకుండా రోడ్లపై నీళ్ళు పారుతున్నాయి. మారతహళ్లిలోని స్పైస్ గార్డెన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు తేలియాడుతూ కనిపించాయి. కొన్ని ప్రీమియం సొసైటీలు కూడా మొదటిసారి వరదలను ఎదుర్కొంటున్నాయి.

బెంగళూరు శివార్లలో ఉన్న టెక్ పార్కులకు నగరాన్ని కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ప్రభావితమైంది. ఎకో స్పేస్ సమీపంలోని ORR బెల్లందూర్ మురికినీటి కాలువల నుండి వర్షపు నీరు వీధిలోకి ప్రవహించడంతో వరదలు రోడ్లను ముంచెత్తాయి.

నగరంలోని ఐటీ కారిడార్ ను వర్షం ముంచెత్తింది. చాలా కార్యాలయాల్లోకి వర్షం నీరు చేరింది. దాంతో ఉద్యోగులో వర్క్ ఫ్రం హోం చేయాలని ఫ్లిప్ కార్ట్, ఆమేజాన్, విప్రో తో సహా పలు సంస్థలు తమ ఉద్యోగులకు సూచించాయి. వర్షాల వల్ల తమకు 225 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ ప్రకటించింది.

రోడ్ల మీద పారుతున్న నీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజనులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 10 నిమిషాలు వర్షం కురిస్తేనే సిటీ ఇంత‌ అధ్వానంగా తయారైందని.. పెద్ద మొత్తంలో తాము కడుతున్న పన్నుల వల్ల ఉపయోగం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ కష్టాలను సోషల్ మీడియాలో వెళ్ళబోసుకున్నారు. ఒకప్పుడు బెంగుళూరు లో ఉద్యోగం చేయాలని తపనపడే ఉద్యోగులు ఇప్పుడు బెంగుళూరును ఎప్పుడు వదిలి వెళ్దామా అని ఆలోచిస్తున్నారని పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కామెంట్లు చేస్తున్నారు.


కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్లను బాగుచేయడం కానీ, మురుగునీటి వ్యవస్థను క్రమబద్దీకరించడంకానీ చేయలేదని నెటిజనులు ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగానికి కలల సామ్రాజ్యంగా ఉన్న బెంగళూరు ఇప్పుడు వెనకపడడానికి, సాఫ్ట్ వేర్ కంపెనీలు వేరే రాష్ట్రాల వైపు చూపు సారించడానికి ప్రభుత్వ విధానాలు, పని పద్దతి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్నాటకలో హింస కూడా పెరిగిపోయింది. రాజకీయ నేతలు రెచ్చ గొడుతున్న మత విద్వేషాలతో అక్కడ శాంతి భద్రతల పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ అన్ని పరిస్థితుల రీత్యా చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.


Tags:    
Advertisement

Similar News