కర్నాటక బీజేపీ స్టార్ హీరోలనే నమ్ముకుందా..?

తనపై పార్టీ ముద్ర పడే సరికి రిషబ్ శెట్టి వెంటనే స్పందించారు. నో పొలిటికల్ కలర్ అంటూ ట్వీట్ వేశారు.

Advertisement
Update:2023-04-14 15:33 IST

కర్నాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బీజేపీ కొత్త ప్రచార అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. పొలిటికల్ సీన్ కి సినీ గ్లామర్ అద్దాలని చూస్తోంది. ఇప్పటికే సినీ నటి సుమలత బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు, సీఎం బొమ్మైని కలసి వెళ్లారు. తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా సీఎం బసవరాజ్ బొమ్మైని కలవడంతో ఈ వ్యవహారం హైలెట్ గా మారింది.

ఉడిపిలో సీఎం బసవరాజ్ బొమ్మై, రిషబ్ శెట్టి ఒకే ఆలయంలో ఒకేసారి పూజలు చేశారు. ఉడిపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరు కలిసి ఆలయంలో కనిపించడంతో కన్నడ నాట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి కూడా బీజేపీకి మద్దతిచ్చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కాంతార సినిమాతో దర్శక నటుడు రిషబ్ శెట్టి బాగా పాపులర్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు, ఆయన నటనకు అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి, సీఎం బొమ్మైని కలవడం ఆసక్తికరంగా మారింది. తనపై పార్టీ ముద్ర పడే సరికి రిషబ్ శెట్టి వెంటనే స్పందించారు. నో పొలిటికల్ కలర్ అంటూ ట్వీట్ వేశారు. కొల్లూరు మూకాంబిక దర్శనానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిశానని, దీంట్లో ఎలాంటి రాజకీయం లేదని, ప్రస్తుతం తాను కాంతారా-2 స్క్రిప్టు రచనలో బిజీగా ఉన్నానని తెలిపారు.


రిషబ్ శెట్టి వివరణ ఇచ్చినా కూడా కర్నాటకలో ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. బొమ్మైకి రిషబ్ మద్దతిచ్చారని, రిషబ్ ఫ్యాన్స్ అందరూ బీజేపీకి మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బొమ్మై కూడా ఈ విషయంపై స్పందించారు. రిషబ్ తనకు మంచి స్నేహితుడని, ఆయన తమ భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఆయనతో ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు బొమ్మై. 

Tags:    
Advertisement

Similar News