ఇకపై లాకర్లలో నగదు దాచుకోకూడదు.. - ఆర్బీఐ ఆదేశాలు
ఈ ఏడాది జూన్ 30 నాటికి 50 శాతం, సెప్టెంబర్ 30 కల్లా 75 శాతం, డిసెంబరు 31 నాటికి 100 శాతం మంది వినియోగదారుల నుంచి ఒప్పందాలను పూర్తిచేయాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టం చేసింది.
బ్యాంక్ లాకర్లలో ఇకపై నగదు దాచుకోవడానికి అవకాశం లేదు. దీనిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల్లో లాకర్ వినియోగంపై ఖాతాదారులు కొత్త ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి ఒకటితోనే కొత్త ఒప్పందాల గడువు ముగిసినప్పటికీ.. చాలా మంది ఇంకా ఒప్పందాలు చేసుకోకపోవడంతో 2023 డిసెంబర్ 31 వరకు ఆర్బీఐ గడువు పొడిగించింది. ఒప్పందం చేసుకోని వినియోగదారుల లాకర్లను కొన్ని బ్యాంకులు ఇప్పటికే సీజ్ చేయడంతో ఆయా లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయం కల్పించాలంటూ అన్ని బ్యాంకులకూ ఆర్బీఐ తాజాగా ఆదేశాలిచ్చింది. కొత్త ఒప్పందాల విషయంలో బ్యాంకులకు దశలవారీగా లక్ష్యలను నిర్దేశించింది.
ఈ ఏడాది జూన్ 30 నాటికి 50 శాతం, సెప్టెంబర్ 30 కల్లా 75 శాతం, డిసెంబరు 31 నాటికి 100 శాతం మంది వినియోగదారుల నుంచి ఒప్పందాలను పూర్తిచేయాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టం చేసింది.
కొత్త ఒప్పందం ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు దాచుకోకూడదని, అలాగే లాకర్ కేటాయించే సమయంలో వినియోగదారుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆర్బీఐ తెలిపింది. ఈ సదుపాయం వినియోగించుకోవడానికి ఏటా చెల్లించే కనీస నిర్వహణ సొమ్మును రాబట్టుకోవడానికి అంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే మొత్తాన్ని డిపాజిట్ చేయమని కొన్ని బ్యాంకు శాఖలు కోరుతున్నాయి.
ఉదాహరణకు లాకర్ వార్షిక నిర్వహణకు రూ.1000 చెల్లించాల్సి ఉంటే.. అంత సొమ్ము రావడానికి వారు కనీసం రూ.2 లక్షల నగదు డిపాజిట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. గతంలో లాకర్లు తీసుకున్నవారు వాటిని కొందరు నెలలు, ఏళ్ల తరబడి కూడా తెరవడం లేదని, అలాంటివారు తప్పనిసరిగా కొత్త ఒప్పందం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశారు.
లాకర్లలో దాచుకోదగినవి... దాచకూడనివి..
♦ లాకర్లలో నగల వంటి విలువైన వస్తువులు, పత్రాలు మాత్రమే దాచుకోవచ్చు.
♦ నగదు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు, నిషిద్ధ వస్తువులు, పాడైపోయే పదార్థాలు/ వస్తువులు, బ్యాంకుకు లేదా ఖాతాదారులకు హాని / ఇబ్బంది కలిగించే చట్ట విరుద్ధ వస్తువులు లాకర్లలో దాచకూడదు.