ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ అవకాశం..
ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులు ఇప్పుడు ఏ దేశంలో అయినా మిగతా కోర్సు కంప్లీట్ చేసేందుకు NMC అవకాశమిస్తోంది. అలా కోర్స్ పూర్తి చేసినా సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్ యూనివర్శిటీ నుంచే వస్తుంది. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని ఆయా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు భరోసా ఇస్తున్నాయి.
యుద్దం కారణంగా ఉక్రెయిన్ నుంచి భారత్‌కి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. భారత్‌లో ఎంబీబీఎస్ కొనసాగించేందుకు కోర్టులో కేసు వేసినా జాతీయ వైద్య మండలి(NMC) అనుమతివ్వలేదు. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది NMC. ఇతర ఏ దేశంలో అయినా ఆ కోర్స్ కొనసాగించేందుకు అవకాశమిచ్చింది.
ఒకే దేశం, ఒకే ఇంటర్న్‌షిప్..
విదేశాల్లో వైద్య కోర్సులు చదివే విద్యార్థులు.. అక్కడే డిగ్రీ పట్టాతోపాటు ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేయాలనే నిబంధన ఉంది. అందులోనూ భారత్ అనుమతించిన దేశాల్లోని సర్టిఫికెట్లకే ఇక్కడ విలువ ఉంది. కానీ ఉక్రెయిన్ ఉదంతం తర్వాత వీటిల్లో చాలా నిబంధనలు మార్చాల్సిన అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులు ఇప్పుడు ఏ దేశంలో అయినా మిగతా కోర్సు కంప్లీట్ చేసేందుకు NMC అవకాశమిస్తోంది. అలా కోర్స్ పూర్తి చేసినా సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్ యూనివర్శిటీ నుంచే వస్తుంది. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని ఆయా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు భరోసా ఇస్తున్నాయి.
టెంపరరీ రీలొకేషన్..
ఉక్రెయిన్ విద్యార్థుల ట్రాన్స్ ఫర్‌ను టెంపరరీ రీలొకేషన్ అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్-2002 నిబంధనలు పాటించి ఉక్రెయిన్ వెళ్లిన వైద్య విద్యార్థుల అకడమిక్ మొబిలిటీ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదని NMC స్పష్టం చేసింది. దీనితోపాటు, ఉక్రెయిన్‌లోని కళాశాలలు తమ బోధనా సిబ్బంది ద్వారా భారతీయ విద్యార్థులకు విదేశీ కళాశాలల్లో కోర్సులు నిర్వహించినా వాటిని కూడా NMC గుర్తిస్తుందని ప్రకటించారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు భారత్‌లో తాము వైద్య విద్య కొనసాగిస్తామనే డిమాండ్ చేస్తున్నారు. ఈ టెంపరరీ రీలొకేషన్ అవకాశాన్ని ఎంత మంది వినియోగించుకుంటారో చూడాలి.