రిలయన్స్ చేతికి మెట్రో.. గుత్తాధిపత్యంతో ఎవరికి ప్రయోజనం..?

దేశీయంగా రిలయన్స్ సంస్థకు 16,600 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఆ తర్వాత మోర్ సూపర్ మార్కెట్లు రిలయన్స్ కి పోటీ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు బలమైన హోల్ సేల్ వ్యాపారం కూడా రిలయన్స్ కి తోడవుతోంది.

Advertisement
Update:2022-12-23 07:42 IST

భారత్ లో రిటైల్ రంగంలో అతి పెద్ద డీల్ కుదిరింది. ఇప్పటి వరకూ హోల్ సేల్ వ్యాపారంలో ప్రత్యేక ముద్ర వేసిన జర్మనీ కంపెనీ మెట్రో ఇప్పుడు రిలయన్స్ వశమైంది. ఈ డీల్ తో రిటైల్ వ్యాపారంతోపాటు, టోకు వ్యాపారంలో కూడా రిలయన్స్ అడుగు పెడుతున్నట్టయింది. అయితే ఈ డీల్ తో చిన్న చిన్న వ్యాపారులకు చిక్కులు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ భారత్ లో 2003లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 పెద్ద ఫార్మేట్‌ స్టోర్లు మెట్రోకు ఉన్నాయి. చిన్న నగరాల్లో ఉన్న స్టోర్లు వీటికి అదనం. కూరగాయలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టేషనరీ.. ఇలా అన్నీ మెట్రోలో దొరుకుతాయి. అయితే ఇక్కడ హోల్ సేల్ గా కొనేవారికే వాటిని అమ్ముతారు. రిటైల్ బేరాలు కుదరవు. ప్రభుత్వ శాఖల వద్ద నమోదైన హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీస్ లు, కంపెనీలు, కిరాణా స్టోర్లకు మాత్రమె మెట్రోలో కొనుగోలు చేసే అవకాశముంటుంది. చిన్న రిటైలర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి సరకులు విక్రయిస్తుంటారు. ఇలాంటి హోల్ సేల్ స్టోర్ల ద్వారా రిలయన్స్, మోర్, డి-మార్ట్, విశాల్, హెరిటేజ్ వంటి స్టోర్ల వ్యాపారం కాస్త దెబ్బతిన్నదనే చెప్పాలి. అయితే ఇప్పుడు రిలయన్స్ కాస్తా మెట్రోని గుప్పెట పట్టడంతో ఇకపై హోల్ సేల్ బిజినెస్ ఎలా ఉంటుందో చూడాలి. దేశీయంగా రిలయన్స్ సంస్థకు 16,600 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఆ తర్వాత మోర్ సూపర్ మార్కెట్లు రిలయన్స్ కి పోటీ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు బలమైన హోల్ సేల్ వ్యాపారం కూడా రిలయన్స్ కి తోడవుతోంది. దీంతో ఇతరత్రా రిటైల్ స్టోర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగే అకాశముంది. హోల్ సేల్ వ్యాపారంలో బలంగా ఉన్న వాల్ మార్ట్ ఇండియాను ఆమధ్య ఫ్లిప్ కార్ట్ గ్రూప్ కొనుగోలు చేయగా, ఇప్పుడు మెట్రోని రిలయన్స్ హస్తగతం చేసుకుంది.

డీల్ ఎలాగంటే..?

రూ.2,850 కోట్లకు మెట్రోను రిలయన్స్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాలో 100 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. రూ.2850 కోట్ల నగదు చెల్లించడానికి సిద్ధపడింది. 2023 మార్చి కల్లా ఈ డీల్ పూర్తవుతుంది.

Tags:    
Advertisement

Similar News