2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర: ఆర్థికవేత్త అమర్త్యసేన్
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ TMC, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ (FF) ను ఏర్పాటు చేశాయని ఆర్థికవేత్త అమర్త్యసేన్ గుర్తు చేశారు. ఈ సారి ఇలాంటి ప్రయోగం వల్ల ప్రయోజనముంటుందని ఆయన అన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2024 లోక్‌సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి అనుకూలంగా హార్స్ రైడ్ అనుకోవడం పొరపాటు అని నొక్కి చెప్పారు.
" అనేక ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైనవిగా నేను భావిస్తున్నాను. డిఎంకె ఒక ముఖ్యమైన పార్టీ అని నేను అనుకుంటున్నాను, టిఎంసి కూడా ఖచ్చితంగా ముఖ్యమైనది. సమాజ్‌వాదీ పార్టీకి కూడా కొంత స్థానం ఉంది.'' అని ఆయన అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ TMC, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ (FF) ను ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఇలాంటి ప్రయోగం వల్ల ప్రయోజనముంటుందని ఆయన అన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), జనతాదళ్ (యునైటెడ్)తో సహా పలు పార్టీల నాయకులు 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌తో సహా కొత్త కూటమికి ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారన్న విషయాన్ని కూడా అమ్ర్త్యసేన్ గుర్తు చేశారు.
"భారతదేశం యొక్క విశాల దృష్టిని బిజెపి గణనీయంగా తగ్గించింది. ఇది భారతదేశాన్ని కేవలం హిందూ భారతదేశంగా, హిందీ మాట్లాడే భారతదేశం స్థాయికి కుదించింది. ఒక వేళ ఈ రోజు భారతదేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం లేకుంటే అది విచారకరం.'' అన్నారాయన.
"బీజేపీ బలంగా, శక్తివంతంగా కనిపిస్తుండవచ్చు కానీ దానికి కూడా చాలా బలహీనతలున్నాయి. కాబట్టి, ఇతర రాజకీయ పార్టీలు నిజంగా ప్రయత్నిస్తే గట్టి పోటీ ఇవ్వగలవు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా ఉండాలి’’ అని అన్నారు.
"మమతా బెనర్జీకి దేశానికి ప్రధాని కాగల సామర్థ్యం లేదని కాదు. ఆమెకు స్పష్టంగా సామర్థ్యం ఉంది. కానీ బిజెపికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటిని ఒక్కటి చేయగల శక్తి ఆమెకుందా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేయడానికి ఆమె నాయకత్వం వహించాలి" అని అమర్త్యసేన్ చెప్పారు.
2024 ఎన్నికల్లో విజయం సాధించగల కాంగ్రెస్ సామర్థ్యంపై సేన్ సందేహాలు వ్యక్తం చేశారు, ఆ పార్టీ బలహీనపడిందని అతను భావిస్తున్నారు. అయితే అఖిల భారత దృష్టిని అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.
"కాంగ్రెస్ చాలా బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఎవరైనా కాంగ్రెస్‌పై ఎంతవరకు ఆధారపడగలరో నాకు తెలియదు. మరోవైపు, కాంగ్రెస్ ఖచ్చితంగా అఖిల భారత విజన్‌ను అందిస్తుంది, ఇది మరే ఇతర పార్టీలు చేయలేవు. అయితే కాంగ్రెస్ లో అనేక అంతర్గత విభేదాలు ఉన్నాయి." అని ఆయన అన్నారు.