ఆర్థిక సంక్షోభం దిశగా భారత్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే పెద్ద పెద్ద దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మాంద్యం వాస్తవమేనంటున్న రాణే.. భారత్ లో కూడా అలాంటి పరిస్థితులు జూన్ తర్వాత వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.

Advertisement
Update:2023-01-17 19:08 IST

రూపాయి విలువ పడిపోతోంది అంటే.. కాదు కాదు డాలర్ బలపడుతోందని సెలవిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎందుకీ ద్రవ్యోల్బణం అంటే, అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి ఉందని సర్ది చెబుతారు మరో మంత్రి. అదేంటని ప్రశ్నిస్తే మోదీ భక్తులు రెచ్చిపోతారు. అభివృద్ధి కంటకులు అంటూ ప్రతిపక్షాలపై ఎగిరెగిరి పడతారు. వందే భారత్ వచ్చింది చూస్కోండి, గంగా విలాస్ దూసుకెళ్తోంది కాస్కోండి అంటూ సమస్యని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ తాజాగా కేంద్ర మంత్రి నారాయణ రాణె చేసిన వ్యాఖ్యలు భారత ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తుతుందని వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్(IMF) ఇప్పటికే హెచ్చరించాయి. భారత్‌ లోనూ దీని ప్రభావం ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణె కీలక వ్యాఖ్యలు చేశారు. మాంద్యం ఉంటే భారత్ లో జూన్ తర్వాత దాని ప్రభావం కనిపిస్తుందని అన్నారాయన. ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

ఆర్థిక మాంద్యం గురించి తమకు కొంత సమాచారం ఉందన్న రాణే.. ప్రధాని మోదీ సైతం కొన్ని సలహాలు, సూచనలు చేశారని చెప్పారు. ఇప్పటికే పెద్ద పెద్ద దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మాంద్యం వాస్తవమేనంటున్న రాణే.. భారత్ లో కూడా అలాంటి పరిస్థితులు జూన్ తర్వాత వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.

రాణే వ్యాఖ్యలు నిజమైతే.. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని ఒప్పుకున్నట్టే. ఆర్థిక మాంద్యం ఉందని తెలిసినా ఆ ప్రభావం మనపై ఉండదంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు నిర్మలమ్మ. ప్రజల కళ్లకు కనికట్టు కట్టాలని చూశారు. తీరా ఇప్పుడు మరో మంత్రి రాణే చావుకబురు చల్లగా చెప్పారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. రాబోయే ఆరు నెలల్లో మాంద్యం పరిస్థితులు తలెత్తుతాయని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారని.. దీనిపై మోదీ ఏం చెబుతారని ప్రశ్నించారు జైరాం రమేష్. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News