ఐదేళ్లలో10 ల‌క్ష‌ల కోట్ల మొండి బ‌కాయిలు మాఫీ- స్ప‌ష్టం చేసిన ఆర్బీఐ

గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు గ‌తంలో కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది

Advertisement
Update:2022-11-21 19:26 IST

దేశంలోని ప‌లు బ్యాంకుల వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించే కీలకమైన ఓ రిపోర్ట్ వెలుగుచూసింది. దేశంలోని బ్యాంకులు గత ఐదేళ్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి. రూ.10,09,510 కోట్లు (123.86 బిలియన్ డాలర్లు) మేర రద్దు చేయడం బ్యాంకుల ఎన్పీఏలు (NPAs) తగ్గుదలకు కారణమైంది. ఇక ఇచ్చిన రుణాల్లో 13 శాతం మాత్రమే బ్యాంకులు నిరర్ధ‌క ఆస్తుల నుంచి రికవరీ చేశాయి. అంటే రూ.1,32,036 కోట్లు రికవరీ చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేషన్ యాక్ట్ కింద 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సమాచారం కోరగా ఈ మేరకు ఆర్బీఐ వివరాలు వెల్ల‌డించింది.

ఈ రిపోర్టు ప్ర‌కారం.. గత పదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల తగ్గుదలకు రుణమాఫీనే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి సమాచారాన్ని క్రోడీకరించినట్టు వివరించింది. ప్రైవేటు బ్యాంకుల‌తో పోలిస్తే, ప్రభుత్వరంగ బ్యాంకులే అత్యధికంగా రుణమాఫీ చేశాయి. రూ.7,34,738 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు రద్దు చేయగా.. ఏ బ్యాంకు ఎంతమేర మాఫీ చేసిందనే విషయాన్ని ఆర్బీఐ వెల్ల‌డించ‌లేదు. ఈ తరహా సమాచారం తమవద్దలేదని మాత్రం ఆ నివేదిక‌లో వివరించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బ్యాంకులు చిన్నా, పెద్ద రుణాలను మాఫీ చేసినప్పటికీ రుణగ్రహీతల వ్యక్తిగత వివరాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కాగా గత ఐదేళ్లకు సంబంధించి ఎస్బీఐ రూ.2,04,486 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.67,214 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.66,711 కోట్ల మేర రద్దు చేశాయి. మూడు నెలలకుపైగా రుణం చెల్లించకపోతే ఆ లోన్‌ను నిరర్ధక ఆస్తిగా (NPA) బ్యాంకులు ప్రకటిస్తాయి. ఈ రిపోర్టులో ఆంధ్ర బ్యాంకు పేరు క‌నిపించ‌లేదు.

గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు గ‌తంలో కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఇలా మాఫీ చేసిన మొండి బ‌కాయిలు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో ఈ మొత్తం రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఆగ‌ష్టు 3న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Tags:    
Advertisement

Similar News