కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న.. బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌కు చెందిన కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Update:2024-01-23 22:13 IST

బిహార్‌ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు కర్పూరి ఠాకూర్‌కు మరణాంతరం అత్యున్నత పురస్కారం ప్రకటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరణించిన 35 ఏళ్ల తర్వాత ఆయనకు ఈ అవార్డు దక్కింది. జనవరి 24న ఆయన శత జయంతి సందర్భంగా భార‌త‌ర‌త్న‌ అవార్డును ప్రకటించారు.

బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో అత్యంత వెనుకబడిన నాయి సమాజ్‌ అనే సామాజికవర్గంలో 1924లో జన్మించారు కర్పూరి ఠాకూర్‌. బిహార్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్‌ను.. స్థానికులు జననాయక్‌గా పిలుచుకుంటారు. 1970 డిసెంబర్‌ - 1971 జూన్‌ మధ్య మొదటిసారి, డిసెంబర్‌ 1977 - 1979 ఏప్రిల్‌ మధ్య రెండో సారి బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బిహార్‌కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌. రాష్ట్ర‌ప‌తి ప్ర‌క‌ట‌న‌తో ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలన్న జేడీయూ, ఆర్జేడీల దీర్ఘకాల డిమాండ్‌ నెరవేరినట్లయింది.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌కు చెందిన కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాకూర్‌ ఉత్తర భారతంలో సోషలిస్టు ఉద్యమాలను నాయకత్వం వహించారు. 40 పార్లమెంట్ స్థానాలున్న బిహార్‌లో బీజేపీ అంత బలంగా లేదు. బిహార్‌లో ప్రాంతీయ పార్టీలు జేడీయూ, ఆర్జేడీ బలంగా ఉన్నాయి. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను తిరిగి తమవైపు తిప్పుకునేందుకే కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించారన్న ప్రచారమూ జరుగుతోంది. కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడంపై నితీశ్‌ కుమార్‌ స్పందించారు. ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం దళితులు, నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సానుకూల భావాలను సృష్టిస్తుందన్నారు.

నితీశ్‌ కుమార్‌ 2014లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. తర్వాత మళ్లీ బిహార్‌లోని అన్ని పార్టీలను కలుపుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏకు గుడ్‌బై చెప్పాడు నితీశ్‌ కుమార్‌. కర్పూరీ ఠాకూర్‌ను బిహార్‌లోని వెనుకబడిన కులాలు ఇప్పటికీ ఆరాధిస్తున్నాయి. ఈ వర్గాలన్ని ప్రస్తుతం నితీశ్‌ కుమార్‌కు అండగా ఉన్నాయి. ఈ వర్గాలను తమవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News