దామగుండం రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌ శంఖుస్థాపన

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు

Advertisement
Update:2024-10-15 14:13 IST

భారత నౌకాదళానికి సంబంధించిన 'వెరీ లో ఫ్రీక్వెన్సీ' (వీఎల్‌ఎఫ్‌) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ రాడార్‌ కేంద్రానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ స్టేషన్‌ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న 'ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌'కు ఆరు నెలల కిందటే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్‌ స్టేషన్‌లో పాటు టౌన్‌షిప్‌ నిర్మాణం కానున్నది. ఇందులో పాఠశాలలు, ఆస్పత్రి, బ్యాంక్‌, మార్కెట్‌ వంటి సౌకర్యాలుంటాయి. నేవీ యూనిట్‌లో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తంగా ఈ టౌన్‌షిప్‌లో సుమారు 2,500-3000 మంది నివసించే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డును నిర్మించనున్నారు. కొత్త వీఎల్‌ఎఫ్‌ కేంద్రాన్ని 2027లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అంతకుముందు పూడూర్ మండలంలో నేవీ రాడార్​ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం, కేంద్ర మంత్రులు రోడ్డు మార్గాన వికారాబాద్ జిల్లా పూడూర్ మండలానికి బయలుదేరారు. మరోవైపు దామగుండంలో రాడార్‌ కేంద్రం ఏర్పాటును స్థానిక ప్రజలతోపాటు, పర్యావరణ ఉద్యమకారులు కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

Tags:    
Advertisement

Similar News