అసలు కారణం ఇదే.. రైల్వే మంత్రి ప్రకటన
ఈ ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా, 1175 మందికి గాయాలయినట్టు లెక్క తేల్చారు. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ఒడిశా రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ లోపం అని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించగా.. తాజాగా అసలు కారణం కనుగొన్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని ఆయన పర్యవేక్షించారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ చేపట్టిన విచారణలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లే ప్రమాదం జరిగినట్టు తేలిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామన్నారు రైల్వే మంత్రి.
త్వరలో పూర్తి నివేదిక..
ప్రమాదంపై రైల్వే భద్రతా విభాగ కమిషనర్ త్వరలో పూర్తి నివేదిక సమర్పిస్తారని చెప్పారు రైల్వే మంత్రి. సహాయక చర్యలు పూర్తయ్యాయని మృతదేహాలన్నిటినీ తొలగించామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా, 1175 మందికి గాయాలయినట్టు అధికారులు లెక్క తేల్చారు. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ట్రాక్.. పునరుద్ధరణ చర్యలు వేగం
రైల్వే లైన్ పై బోగీలు చెల్లాచెదరుగా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. తిరిగి రైళ్లను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు పూర్తయ్యాయి. బుధవారం ఉదయానికల్లా ఇక్కడ రైళ్లు నడిచేలా ఈ మార్గాన్ని తిరిగి వినియోగంలోకి తెస్తామంటున్నారు అధికారులు. బోగీలను తొలగించి, కొత్తగా ఇక్కడ పట్టాలను వేయబోతున్నారు. మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించి, బుధవారం నుంచి రైళ్లను అనుమతిస్తారు.